‘గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ పార్ట్ పూర్తయ్యింది’ అంటూ ‘భారతీయుడు 2’ ప్రెస్ మీట్లో దర్శకుడు శంకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకొన్నారు. దానికి రెండు కారణాలు. ఒకటి.. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ చివరి అంకానికి చేరుకొందన్న ఆనందం. రెండోది చరణ్ కొత్త సినిమా సెట్లో అడుగు పెట్టడానికి రంగం సిద్ధం అయ్యిందన్న సంతోషం. అయితే ఈ ఆనందాన్ని, సంతోషాన్ని శంకర్ ఎన్నో రోజులు ఉంచలేదు. ‘గేమ్ ఛేంజర్’లో చరణ్ పార్ట్ పూర్తయ్యినా, ఇంకా తనని వెయిటింగ్ మోడ్‌లోనే ఉంచినట్టు తెలుస్తోంది. తాను చెప్పేంత వరకూ గెటప్ ఛేంజ్ చేయొద్దని రామ్ చరణ్‌కు చెప్పాడట శంకర్. దాంతో ‘గేమ్ ఛేంజర్’ కోసం తన పని పూర్తయినా, బుచ్చిబాబు సినిమా సెట్లో అడుగు పెట్టలేకపోతున్నాడు.
‘గేమ్ ఛేంజర్’ కోసం చరణ్ పని పూర్తయిన మాట వాస్తవమే. అయితే.. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో చరణ్‌ని శంకర్ వెయిటింగ్ మోడ్‌లో ఉంచాడు. చివరి నిమిషాల్లో సన్నివేశాల్లో మార్పులు జరగొచ్చు, కొత్త ఆలోచనలు రావొచ్చు, లేదంటే.. ప్యాచ్ వర్క్ కోసం చరణ్ అవసరం కావొచ్చు. అందుకే ఎడిటింగ్ టేబుల్ దగ్గర సినిమా చూసుకొనేంత వరకూ చరణ్‌ని అదే గెటప్ లో ఉండాలని శంకర్ సూచించాడట. అందుకే చరణ్ ఇంకా ‘గేమ్ ఛేంజర్’ గెటప్‌లోనే ఉన్నాడు. ‘గేమ్ ఛేంజర్’ పూర్తయితే, వెంటనే తన పని మొదలుపెట్టాలని బుచ్చిబాబు భావించాడు. కానీ.. శంకర్ మాత్రం వదిలేలా లేడు. అందుకే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టాడు బుచ్చిబాబు. ‘గేమ్ ఛేంజర్’ పూర్తయినా, చరణ్ కొంతకాలం బ్రేక్ తీసుకొంటాడని, ఇప్పట్లో బుచ్చిబాబు సినిమా సెట్లో అడుగుపెట్టే సూచనలు లేవని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.