దర్యాప్తు చేయాల్సింది అలా కాదు.. ఇలా అని ఓ నిందితుడు పోలీసులకు చెబితే ఎలా ఉంటుంది ? అసలు అలా చెప్పాలని ఆలోచన నిందితుడికి రావడమే గొప్ప. అలాంటి ఆలోచనలు వచ్చే వాళ్లు అలాంటిలాంటి మైడ్ సెట్ ఉన్న వాళ్లు కాదు. ఎందుకంటే వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన దేవిరెడ్డి శంకర్ రెడ్డి అనే వ్యక్తి .. నేరుగా సీబీఐ డైరక్టర్కే దర్యాప్తు ఎలా చేయాలో చెబుతూ లేఖ రాసి.. దాన్ని మీడియాకు కూడా విడుదల చేశారు. ఓ వర్గం మీడియా దాన్ని విపరీతంగా హైలెట్ చేసింది.
చంద్రబాబు అప్పుడెప్పుడో సెక్రటేరియట్ ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవితో సమావేశమయ్యారు. ఆ తర్వాత విజయవాడలోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. ఇంటలిజెన్స్ చీప్తో కలిసి వారిద్దరూ వివేకా హత్యకు కుట్ర పన్నారనే కోణంలో దర్యాప్తు చేయాలని శంకర్ రెడ్డి లేఖలో కోరారు. అంతే కాదు వివేకా కుమార్తె సునీత కుటుంబంపైనా దర్యాప్తు చేయాలట. ఆమెపై ఉన్న అనుమానాలేమిటంటే దస్తగిరికి ముందస్తు బెయిల్ సునీతనే ఇప్పించారట. ఆమె శైలి అనుమానాస్పదంగా ఉందని..అలాగే ఆమె మీడియా సంస్థలతో టచ్‌లో ఉన్నారని.. ఇవన్నీ దర్యాప్తు చేయాలంటున్నారు శంకర్ రెడ్డి. పదే పదే వివేకా కుమార్తె సునీత సీబీఐ అధికారులతో సమావేశమయ్యారని ఇది సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేయడమేనని శంకర్ రెడ్డి వాదించారు.
ఎర్రగంగిరెడ్డి ఘటనా స్థలానికి ఎలా చేరుకున్నారు? ఎవరు చెప్తే ఆయన అక్కడకు వచ్చారు? ఘటనా స్థలంలో ఫొటోలు తీయాలని, వీడియో తీయాలని ఆదేశాలు ఇచ్చిన ఇనాయతుల్లాకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు?ఇవన్నీ దర్యాపతు చేయాలని ఆయన అంటున్నారు. శంకర్ రెడ్డి రాసిన లేఖ ఇలా సీబీఐ డైరక్టర్‌కు డైరక్షన్ ఇస్తున్నట్లు సాగిపోయింది. అరెస్ట్ చేస్తారని తెలిసిన తర్వాత లేఖ రాశారో.. లేఖ ఆయన పేరుతో ఎవరైనా పంపారో తెలియదు కానీ.. ఈ లేఖ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
కొసమెరుపేమిటంటే శంకర్ రెడ్డి మాత్రమే ఆయన కొడుకు కూడా సీబీఐకి లేఖ రాశాడు. ఆయన వెర్షన్ ఏమిటంటే తన తండ్రికి అనారోగ్యం కాబట్టి న్యాయం చేయాలని వేడుకున్నాడు. మొత్తానికి వివేకా హత్య కేసులో ఏదో జరుగుతోందన్న అభిప్రాయాన్ని వీరు లేఖల ద్వారా కల్పిస్తున్నారు.