శంకర్ ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. తెరపై భారీ హంగులు సృష్టించడం అతనికి సరదా. వందల కోట్లని నీళ్లలా ఖర్చు పెడతాడు. దానికి తగినట్టుగానే కథల్నీ ఎంచుకుంటాడు. ప్రతీసారీ ఓ పెద్ద కథ, భారీ బడ్జెట్.. ఇలా తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నాడు. మరి ప్రతీసారీ ఇలా అంచనాలు పెంచుకుంటూ పోతే ఎలా?? అది శంకర్‌పై ఒత్తిడి కలిగించదా? ఇదే ప్రశ్న శంకర్‌కి ఎదురైంది. దానికి ఆయన ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.
”నేనో క్రియేటర్‌ని మాత్రమే కాదు. నాలోనూ ఓ ప్రేక్షకుడు ఉంటాడు. తను శంకర్ సినిమా చూస్తూ.. ఇంకా ఏదో కావాలని ఆశిస్తుంటాడు. వాడికి కావల్సినట్టుగా దర్శకుడు శంకర్ మరో సినిమా ఇస్తూ వెళ్తుంటాడు. ఓ ఇంటికి మీరు భోజనానికి వెళ్లారనుకుందాం. విందు చాలా బాగా నచ్చింది. మరోసారి వాళ్లు భోజనానికి పిలిస్తే తప్పకుండా వెళ్తారు.ఈసారి విందు ఇంకా బాగుంటుందని ఆశిస్తారు. కనీసం గత స్థాయిలో అయినా విందు ఇవ్వాలి. లేదంటే మీరు నిరుత్సాహపడతారు. సినిమా ప్రేక్షకుడూ అంతే. వాళ్లకు కావల్సింది మనం ఇవ్వాలి. నేను అందుకు తగినట్టే ప్రయాణం చేస్తున్నా” అని చెప్పుకొచ్చారు శంకర్.