త్రీడీ వెర్షన్ దక్షిణాదివాళ్లకెందుకో కలసి రాలేదు. ఓం, రుద్రమదేవి, యాక్షన్ లాంటి సినిమాలు త్రీడీలోనే తీశారు. తమిళంలోనూ కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ అవేం ఆడలేదు. త్రీడీ అనగానే మనవాళ్లు హాలీవుడ్ స్థాయిలో ఆలోచిస్తారు. అంతటి ఎఫెక్ట్ కనిపించకపోతే నిరుత్సాహ పడతారు. వాళ్ల టెక్నాలజీ వేరు, బడ్జెట్లు వేరు అన్న నిజం మాత్రం తెలుసుకోరు. అందుకే మన త్రీడీలు తేలిపోతాయి. రాజమౌళిలాంటివాడే `బాహుబలి`ని త్రీడీలో తీయాలన్న ఆలోచన కూడా చేయలేక పోయాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే.. త్రీడీ మరింత కష్టం. బడ్జెట్ కూడా పెరుగుతుంది. కానీ శంకర్ మాత్రం 2.ఓని త్రీడీలో రూపొందించాడు. అసలే ఈ సినిమాకి భారీ బడ్జెట్ అవసరం. దానికి త్రీడీ అనే మరో గుది బండ చేర్చాడు. 2. ఓ ఆలస్యం అవ్వడానికి త్రీడీ వెర్షన్ కూడా ఓ కారణం.
కాకపోతే.. ఇప్పుడు త్రీడీ ఫలాలు ఈ సినిమాకి అందుతున్నాయి. త్రీడీ కోసం పడిన కష్టం.. కలిసొచ్చింది. 2.ఓ అటు 2డీ వెర్షన్లోనూ, ఇటు 3డీ వెర్షన్లోనూ విడుదలయ్యింది. 2డీతో పోలిస్తే.. 3డీ వెర్షన్‌కే డిమాండ్ ఏర్పడింది. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ సినిమాని త్రీడీలో చూడాలనుకుంటున్నారు. వాళ్లతో పాటు పెద్దలూ త్రీడీ టికెట్‌ని తీసుకోవాల్సివస్తోంది. 2డీతో పోలిస్తే.. త్రీడీ టికెట్టు రేటు ఎక్కువ. 2.ఓ వసూళ్లలో త్రీడీ భాగం బాగానే కనిపిస్తోంది. 2డీలో చూసినవాళ్లు.. `ఈ సినిమాని ఈసారి త్రీడీలో చూడాలి` అని ఫిక్సవుతున్నారు. దాంతో రిపీటెడ్ ఆడియన్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సమీకరణాలన్ని బట్టి చూస్తే.. శంకర్ వ్యూహం ఫలించినట్టే కనిపిస్తోంది.
కాకపోతే అన్ని కథలూ త్రీడీకి పనికిరావు. భారీ యాక్షన్ ఎపిసోడ్లు ఉంటే.. త్రీడీలో తీసుకొవచ్చు. హారర్ సినిమాలకు మరింత అనువుగా ఉంటుంది. త్రీడీ క్లిక్ అయితే మరో ప్రమాదం కూడా ఉంటుంది. 2డీ వెర్షన్‌ని చూడ్డానికి ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడకపోవొచ్చు. త్రీడీ సాంకేతిక అందుబాటులో ఉన్న థియేటర్లు చాలా తక్కువ. ఉన్నా.. ఆ ఎఫెక్టులు అంతంత మాత్రంగానే ఉంటాయి. థియేటర్లు త్రీడీకి అనువుగా మారితే.. సౌండ్ సిస్టమ్ విషయంలో అప్డేట్ అయితే… త్రీడీకి మరింత గిరాకీ పెరుగుతుంది.