గ్రాఫిక్స్ తో పెట్టుకున్న దర్శకుడు సుఖంగా నిద్రపోయినట్లు చరిత్రలో లేదు. ఇదేదో సినిమా డైలాగ్ కి పేరడీ కాదు. ది గ్రేట్ బాహుబలి తీసిన రాజమౌళి ఓ సందర్భంలో చెప్పిన మాట. నిజమే.. సినిమాలో ఎక్కువ శాతం గ్రాఫిక్ పార్ట్ వుంటే ఈ సినిమా దర్శకుడి చేయి దాటి గ్రాఫిక్ కంపెనీ చేతికి వెళుతుంది. అక్కడ నుండి అవుట్ ఫుట్ వచ్చేదాక ఇంక ఎంత తోపు డైరెక్టర్ అయినా చేతులు కట్టుకొని కూర్చోవలసిందే. ఈగ, బాహుబలి సినిమాలతో దర్శకుడు రాజమౌళి స్వీయ అనుభవం నుండి వచ్చిన మాటది. ఇప్పుడు శంకర్ పరిస్థితి కూడా ఇలానే వుంది.
సూపర్ స్టార్ రజనీ కాంత్, శంకర్ కలయికలో రూపుదిద్దుకుంటున్న అతి భారీ చిత్రం 2.ఓ. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. అంచనాలు సంగతి ఏమిటో కానీ ఈ సినిమా గ్రాఫిక్స్ కంపెనీ నుండి ఎప్పుడు భయటపడుతుందా ? అని ఎదురుచూస్తున్నాడు దర్శకుడు శంకర్. ఎప్పుడో సినిమా షూటింగ్ పూర్తి చేసి ఎడిట్ చేసి ఫైల్ ని గ్రాఫిక్స్ టేబుల్ మీద పెట్టిన శంకర్ .. ఇప్పటికీ దాని అవుట్ ఫుట్ తీసుకోలేకపోతున్నాడు. శంకర్ కి గ్రాఫిక్స్ తో సినిమా చేయడం కొత్త కాదు. ఆ మాటకి వస్తే గాఫిక్స్ మాయని ప్రేక్షకుల చూపించిన దర్శకుడాయన. జీన్స్, ప్రేమికుడు సినిమాల్లో ఆయన చేసిన మాయ ఇప్పటికీ కొంతమందికి అర్ధం కాదు. అందులో ఏం టెక్నాలజీ వాడారో. గ్రాఫిక్స్ అంతలా ఆడుకుంటాడు శంకర్.
అయితే 2.ఓ విషయంలో ఓ బ్యాడ్ లక్. ఆయన మొదట గ్రాఫిక్స్ కి ఇచ్చిన కంపెనీ దివాలా తీసింది. దీంతో పని సగంలోనే ఆగిపోయింది. తర్వాత మరో కంపెనీకి ఆ పని అప్పగించారు. ప్రస్తుతం పని జరుగుతుంది. అయితే పని ఇంకా లేట్ అవ్వడంతో సదరు కంపెనీకి డెడ్ లైన్ కూడా పెట్టాడట శంకర్. అక్టోబరు 15వ తేదీలోగా గ్రాఫిక్స్ వర్క్ మొత్తం పూర్తవ్వాలని ఎలాంటి ఆలస్యం ఉండకూడదని కాస్త గట్టిగానే చెప్పినట్లు సదరన్ న్యూస్. నవంబరు 29న సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేస్తానని రజనీ అభిమానులకు శంకర్ మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ టార్గెట్ ని రీచ్ కాలేకపోతానేమో అన్న భయం శంకర్ వేటాడుతుంది. మొత్తానికి 2.ఓ గాఫిక్స్ దగ్గర ఇరుక్కుపోయింది.