శంకరాభరణం.. తెలుగు సినిమా చరిత్రలో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన సినిమా.. అయితే రచయిత కోనా వెంకట్ తను రాసుకున్న ఓ కథకి ఆ టైటిల్ పెట్టి రంగంలో దిగాడు. ఓల్డ్ క్లాసిక్ సినిమా అయినా సరే శంకరాభరణం సినిమాను ఇప్పటికి ఇష్టపడే ప్రేక్షకులు ఉన్నారు. మరి కోనా వెంకట్ అదే టైటిల్ తో ఈరోజు వచ్చిన ప్రేక్షకులను అలరించాడా లేదా.. వరుస హిట్లతో ఫుల్ ఫాంలో ఉన్న నిఖిల్ శంకరాభరణం తో సక్సెస్ సాధించాడా అనేది ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
సరదాగా జీవితం గడుపుతున్న గౌతమ్ (నిఖిల్) కు అనుకోకుండా తండ్రి రఘు (సుమన్) బిజినెస్ లాస్ ల వల్ల చనిపోయే ప్రయత్నం చేస్తాడు. ఆ సమస్య నుండి బయటపడటానికి 12 కోట్ల రూపాయలు అవసరం వస్తాయి. రఘు భార్య రజ్జో (సితార) తనకు భీహార్ లో ఉన్న శంకరాభరణం ప్యాలేస్ ని అమ్ముదామని సలహా ఇస్తుంది. అప్పటి దాకా జాలీగా లైఫ్ ఎంజాయ్ చేసిన గౌతమ్ శంకరాభరణం అమ్మడానికి భీహార్ వస్తాడు. శంకరాభరణంలో తన కుటుంబ సభ్యులు ఉన్నారని తెలుసుకుని వారిని ఎలాగైనా ఇంటి నుండి బయట పడేలా చేసి ఆ ప్యాలెస్ ని అమ్మాలని చూస్తాడు గౌతమ్. ఇంతలోనే గౌతమ్ ప్రేమలో మరదలు హ్యాపీ (నందిత) హీరో ప్రేమలో పడుతుంది. ఇదిలా జరుగుతుంటే భీహార్ లో కిడ్నాపుల కలకలం గురించి అందరు కంగారు పడుతుంటారు. హోం మినిస్టరే కావాలను కిడ్నాప్ చేయించి డబ్బులు డిమాండ్ చేయించి వారిని వదిలేసేలా చూస్తాడు. ఇక భీహార్ లో భాయ్, సలీం, మున్ని గ్యాంగ్ లు తమ హవా కొనసాగిస్తుంటాయి. అసలు శంకరాభరణం అమ్ముదామని వచ్చిన గౌతమ్ కి కిడ్నాప్ గ్యాంగ్ ఎలా తగిలింది..? అసలు గౌతం కిడ్నాప్ ఎలా అయ్యాడు..? హోం మినిస్టర్ సంపత్ చాటుగా చేస్తున్న కిడ్నాప్ గుట్టు తెలుస్తుందా అన్నదు అసలు కథ..?
సాంకేతిక నిపుణులు :
శంకరాభరణం సినిమాకు కోనా వెంకట్ మార్క్ బాగా కనపడ్డది.. సినిమా మొత్తం కోనా పంచ్ డైలాగులే పేలాయి.. ఇక సినిమాకు టెక్నికల్ డిపార్ట్ మెంట్ సపోర్ట్ కూడా బాగా అందిందనే చెప్పొచ్చు. సినిమాకు ముఖ్యంగా సాయి శ్రీ రాం కెమెరా పనితనం మెచ్చుకోదగిన విధంగా ఉంది. భీహార్ బ్యాక్ డ్రాప్ కాబట్టి సినిమా అంతా చాలా నీట్ గా వచ్చేందుకు బాగా కృషి చేశాడు కెమెరా మెన్. దర్శకుడు నందనవనం కొన్ని చోట్ల తడబడ్డా ఫైనల్ గా సినిమా ఓకే అనేలా చేసుకున్నాడు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సాంగ్స్ కొత్తగా ఉన్నాయి. సినిమా ఇంకొంచం ట్రిం అయితే బాగుంటుంది అనిపిస్తుంది. నిఖిల్ వన్ మ్యాన్ షో చేసినా మొదటి భాగం కాస్త ఓవర్ గా అనిపిస్తుంది. కొన్ని డైలాగులు కాస్త అర్ధం కాని విధంగా రాసి కన్ ఫ్యూజ్ చేశాడు కోనా.
విశ్లేషణ:
శంకరాభరణం అని టైటిల్ పెట్టి క్రైమ్ కామెడీ తీయాలనుకోవడంలో కోనా వెంకట్ సాహసం చేశాడని అనాలి. అయితే సినిమా శంకరాభరణం అనే టైటిల్ ఎందుకు పెట్టారంటే ఆ పేరుతో ఉన్న ప్యాలెస్ అమ్మడం కోసం పడే తిప్పలే ఈ సినిమా. అయితే బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘ఫన్ గయా రే ఒబామా’ సినిమ లైన్ ని లేపేసి దాన్నే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చి రాసుకున్నాడు కోనా వెంకట్. తండ్రి అప్పుల బాధలో ఉన్నాడు కొడుకు ఇక్కడ ప్యాలెస్ ని అమ్మడానికి వచ్చాడు ఓకే. కాని మధ్యలో వచ్చే ఈ కిడ్నాప్ డ్రామా సినిమాను రక్తి కట్టించలేకపోయింది. సినిమాకు అసలు విలన్ సంపత్ ను సెకండ్ హాఫ్ లో చివర దాకా అతన్ని ఇన్వాల్వ్ చేయక పోవడం కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. మొదటి భాగంలో కనపడ్డ సంపత్ మళ్లీ చివర 20 నిమిషాలు ఉందనగా కనిపిస్తాడు. ఇక సినిమాలో ఏ కామెడీ అయితే ప్లస్ అవుతుందని భావించి పెట్టాడో అది ఇదవరకు సినిమాల్లో ఆల్రెడీ చూసి చూసి విసిగిపోయారు ప్రేక్షకులు. ఫస్ట్ హాఫ్ సప్తగిరి కామెడీతో నడిపించినా కోనా సెకండ్ హాఫ్ లో పృద్విని బాగానే వాడాడు. అయితే అక్కడక్క స్టార్ హీరోల డైలాగులతో ప్రేక్షకులనైతే ఎంటర్టైన్ చేయగలిగాడు. స్క్రీన్ ప్లే లో మంచి పట్టున్న కోనా వెంకట్ ఈ సినిమాకు అంత పకడ్బందీగా కథనాన్ని తెరకెక్కించలేకపోయాడు. మొదటి భాగం ప్రేక్షకులని సినిమాలో ఇన్వాల్వ్ చేయనీయదు సరికదా కాస్త బోర్ కొడుతుంది. ఇక ఇంటర్వల్ తర్వాత ముందు కాస్త పర్వాలేదనిపించినా మధ్యలో మళ్లీ ప్రేక్షకుల మైండ్ డైవర్ట్ అయ్యేలా చేస్తాడు. ఫైనల్ గా ప్రి క్లైనాక్స్, క్లైమాక్స్ సినిమా ఓకే అనిపించేలా జాగ్రత్త పడ్డాడు. సినిమాలో మున్నిగా అంజలి అదరగొట్టింది. తన పాత్ర మేరకు అంజలి ఓకే అనిపించుకుంది. హీరో నిఖిల్ పర్ఫార్ మెన్స్ బాగుంది. ఎన్నరై గా డైలాగ్ డెలివరీ బాగా ట్రైన్ అయ్యాడు. తండ్రి కోసం తపన పడే కుర్రాడిలా నిఖిల్ మరోసారి మంచి నటన కనబరచాడని చెప్పొచ్చు. ఇక హీరోయిన్ గా చేసిన నందిత సినిమాలో స్కోప్ ఉన్నంత వరకు పర్వాలేదనిపించింది. రావు రమేష్, సంపత్ తమ తమ పాత్రల పరిధి మేరకు మంచి నటనను కనబరిచి ఆకట్టుకున్నారు.
ప్లస్ పాయింట్స్ :
కోనా వెంకట్ డైలాగులు
సినిమాటొగ్రఫీ
నిఖిల్ నటన
మైనస్ పాయింట్స్ :
సినిమా మొదటి భాగమే బోర్ కొట్టడం
స్లో నేరేషన్
ఆడియెన్స్ ఇన్వాల్వ్ అవ్వకపోవడం
స్క్రీన్ ప్లే
తీర్పు :
క్రైమ్ కామెడీ అని చెప్పి ఓన్లీ కామెడీ సినిమా చూపించినట్టుంది కోనా వెంకట్. రాసుకున్న కథ ప్రకారం స్క్రీన్ ప్లే కూడా బాగా గ్రిప్పింగ్ ఉండి ఉంటే బాగుండేది. సినిమా మొదటి రోజు షూటింగ్ నుండి సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఏదో సరదాగా సినిమా చూద్దాం అని వచ్చేవారికి తప్ప.. సినిమాలో ఏ విషయం అంతగా ఆకట్టుకోలేకపోయింది అన్నది అసలు విషయం. నిఖిల్ మాత్రం కోనా పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు కాని.. కోనానే తన పట్టు తప్పాడని చెప్పొచ్చు. అందుకే పేరుకే క్రైమ్ కామెడీ సినిమా మాత్రం శంకరా.. భరణమే..!
తెలుగు360 రేటింగ్ : 2/5
నటీనటులు : నిఖిల్, నందిత, అంజలి, రావు రమేష్, సంపత్, సప్తగిరి తదితరులు
సంగీతం : ప్రవీణ్ లక్కరాజు
దర్శకత్వం : ఉదయ్ నందనవనం
కథ, కథనం , దర్శకత్వ పర్యవేక్షణ, సమర్పణ : కోనా వెంకట్
నిర్మాత : ఎం.వి.వి సత్యానారాయణ