లోక్ సభ ఎన్నికల తరువాత నరేంద్ర మోడీ మరోసారి ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి లేదన్నారు మాజీ కేంద్రమంత్రి, ఎన్.సి.పి. అధినేత శరద్ పవార్ అన్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల తరువాత 2004 మాదిరిగానే రాజకీయ పరిణామాలు ఉండబోతున్నాయని అభిప్రాయపడ్డారు. అప్పట్లో దేశం వెలిగిపోతోందని భాజపా ప్రచారం చేసుకుని ఓటమి పాలైందనీ, ఇప్పుడూ మోడీ అభివృద్ధి అనే నినాదంతో అదే తప్పు చేస్తున్నారనీ ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. ప్రస్తుత భాజపాలో వాజ్ పేయితో సరిపోల్చే నాయకులు ఎవ్వరూ లేరన్నారు శరద్ పవార్.
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే పరిస్థితి లేదని పవార్ కూడా చెప్పడం విశేషం! నిజానికి, ఇదే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం మొన్ననే చెప్పారు. ఆ అభిప్రాయాన్ని సమర్థించారు పవార్. అంతేకాదు, మహా కూటమి ఏర్పాటు గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయిలో కంటే రాష్ట్రాల్లో కూటముల పాత్ర కీలకం కాబోతోందన్నారు. ఒక రాష్ట్రంలో మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు, మరో రాష్ట్రంలో వైరి వర్గాలుగా పోటీ పరిస్థితి రాబోయే ఎన్నికల్లో చూస్తామన్నారు. ఇక, జాతీయ స్థాయిలో ఎన్నికల ముందు కూటముల సంగతి చెప్పలేమన్నారు. కానీ, ఎన్నికల తరువాత ఆయా రాష్ట్రాల పరిస్థితుల దృష్ట్యా భాజపాయేతర సంకీర్ణమే అధికారంలోకి వస్తుంది. ఐదేళ్లపాటు పాలన సాగిస్తుందనీ, సంకీర్ణ రాజకీయాల్లో కొత్త శకం మొదలు కాబోతోందని ఆయన వ్యాఖ్యానించారు.
నిజానికి, ప్రధానమంత్రి అభ్యర్థి రేసులో తాను కూడా ఉన్నానని గతంలో పవార్ ప్రకటించుకున్న సందర్భాలున్నాయి. అయితే, ఇప్పుడా అభిప్రాయం పూర్తిగా మార్చేశారు. తాను ప్రధాని అయ్యేంత పెద్ద పార్టీ తమది కాదని ఆయన అనడం విశేషమే. మహారాష్ట్రంలో ఎన్.సి.పి., కాంగ్రెస్ లు కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. ఇక, ఆయన చెప్పిన విషయాల్లో ఒకటైతే చాలా స్పష్టం… సంకీర్ణ రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడికి 2019 ఎన్నికలు నాంది పలికే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లోనే కనిపిస్తోంది. తెలంగాణలో మహాకూటమిలో భాగంగా టీడీపీ, కాంగ్రెస్ లు కలుస్తున్నాయి. ఆంధ్రాలో అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఇలా రాష్ట్రాలవారీగా పార్టీల అవసరాలూ పొత్తులూ వేర్వేరుగా ఉండే పరిస్థితి అన్ని చోట్లా ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. మొత్తానికి, రాహుల్ ప్రధాని అభ్యర్థి కాదనే విషయాన్ని శరద్ పవార్ కూడా స్పష్టం చేయడం విశేషం. అయితే, దీంతోపాటు భావసారూపత్య ఉన్న నాయకుల్ని, పార్టీలను ఏకం చేసే ప్రయత్నం తాను చేస్తున్నాని చెప్పడం కూడా గమనార్హం.