శరద్ పవార్ తన పార్టీ ఎన్సీపీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కొద్దీ రోజుల క్రితం రాహుల్ గాంధీ శరద్ పవార్ ను కలిశారు . కొద్దీ సేపు వాళ్లిద్దరూ చర్చలు జరిపారు . ఆతరవాతే విలీనం వార్త ప్రచారం లోకి వచ్చింది . కానీ … ఉభయ పార్టీల నాయకులూ ఈ వార్తను ఖండించారు.
ప్రతిపక్ష హోదా కోసం ఎన్సీపీ విలీనం ప్లాన్..?
కాంగ్రెస్, ఎన్సీపీ విలీనం వార్త ప్రచారం లోకి రావడానికి కారణం లేకపోలేదు . లోక్ సభ లో కాంగ్రెస్ పార్టీ కి 52 స్థానాలు మాత్రమే ఉన్నాయి . అధికారికంగా ప్రతిపక్ష హోదా దక్కాలంటే రాజ్యాంగం ప్రకారం మొత్తం సభ్యుల్లో పది శాతం సీట్లు రావాలి . అంటే కాంగ్రెస్ కు 55 స్థానాలు అవసరం . అటు ఎన్సీపీ కి అయిదు స్థానాలున్నాయి .విలీనం జరిగితే కాంగ్రెస్ బలం 57 కు పెరుగుతుంది . అదే జరిగితే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నికైన సోనియా గాంధీకి అధికారికంగా ప్రతిపక్షనాయకురాలి హోదా లభిస్తుంది . 2014 నుంచి కాంగ్రెస్ పార్టీకి ఈ హోదా లేకుండా పోయింది . ముఖ్యమైన పదవులకు జరిగే నియామకాల్లో లోక్ సభ లో ప్రతిపక్ష నాయకుడి పాత్ర చాలా కీలకమైంది . కాంగ్రెస్ కు ఈ హోదా లేనందువల్లనే లోక్ పాల్ నియామకాన్ని బీజేపీ సర్కారు వాయిదా వేస్తూ వచ్చింది . చివరికి సుప్రీమ్ కోర్టు ఆదేశాల వల్ల హడావిడిగా నియామకం చేశారు .
శరద్ పవార్ కూడా అదే మంచిదని అనుకుంటున్నారా..?
ఎన్సీపీ విలీనం వార్తలతో లోక్ సభ లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం హోదా మళ్ళీ చర్చల్లోకి వచ్చింది . నిజానికి శరద్ పవార్ కు ఈ విలీనాలు కొత్త కాదు . అయన రాజకీయ గురువు యశవంత రావు బలవంత రావు చవాన్ నుంచి శరద్ పవార్ ఇదే నేర్చుకున్నారు . మహారాష్ట్రకు మొదటి ముఖ్యమంత్రి వై బి చవాన్ . అయన కూడా సొంత కుంపటి పెట్టుకుని తిరిగి కాంగ్రెస్ లో చేరారు . పవార్ కూడా కాంగ్రెస్ ఎస్ పార్టీ పెట్టారు . తరవాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు . ఇప్పుడు కూడా ఎన్సీపీ , కాంగ్రెస్ నాయకులు కొందరు తమ ప్రైవేటు సంభాషణల్లో విలీనాన్ని పూర్తిగా తోసిపుచ్చడం లేదు .
సోనియా ముందున్న సవాళ్లేమిటి..?
ఈనెల 17 వ తేదీనుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్నాయి . ఈలోగా యూపీఏ పక్షాలను , పార్లమెంటులో కలిసి వచ్చే తటస్థ పార్టీలతో సోనియా గాంధీ కలిసి మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి . పార్లమెంటులో అనుసరించవలసిన వ్యూహం మీద చర్చలు జరగవచ్చు . సొంతంగానే భారీ మెజారిటీతో గెలిచిన బీజేపీ తో లోక్ సభ లో కాంగ్రెస్ పార్టీ తలపడాల్సి ఉంది . సోనియా గాంధీ ఈ కొత్త బాధ్యతలు ఎలా నిర్వహిస్తారన్న విషయం గురించి రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి .