బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అద్యక్షుడు నితిష్ కుమార్‌కు మరో వ్యవస్థాపక నేత శరద్ యాదవ్ గట్టి షాకే ఇచ్చారు. లాలూ ప్రసాద్ కుమారుడైన తేజస్వి యాదవ్‌పై సిబిఐ, ఇడి ఆరోపణలను సాకుగా చూసి నితిష్ మరోసారి ప్రజలు తిరస్కరించిన బిజెపితో జట్టు కట్టడంపై ఆయన వ్యతిరేకత ప్రకటించారు. ఇది ప్రజల తీర్పునకు వ్యతిరేకమనీ, దురదృష్టకరమనీ తేల్చిచెప్పారు. ఇప్పటి వరకూ శదర్ యాదవ్ నిర్దిష్టంగా దీనిపై వ్యాఖ్యానించలేదు. నితిష్ కుమార్ ఆయనను మంచి చేసుకోవడానికి చాలా తంటాలు పడ్డారు. లాలూ మాత్రం శరద్ తమతో వుంటారని చెబుతూ వచ్చారు.ఈ రెండు వాదనల మధ్య మౌనం పాటించిన శరద్ యాదవ్ ఎట్టకేలకు దీనిపై సోమవారం ట్వీట్ చేశారు.లాలూ నితిష్ రామ్ విలాస్ పాశ్వాన్ వంటివారితో సమానమైన శరద్ యాదవ్ తిరస్కరణ రాజకీయంగా కీలక పరిణామమే. ఇప్పటికీ లాలూకు పట్టు వుందనే వాస్తవానికి ఇది నిదర్శనం. నితిష్ చర్యను ఆ పార్టీ అత్యున్నత నేతలే ఆమోదించలేదనీ తెలిసిపోతున్నది. శరద్‌ను మెత్తబర్చడానికి బిజెపి కేంద్ర మంత్రులూ చర్చలు జరిపారట. అయితే కేంద్రంలో తన పాత్ర ఏమిటో వారు స్పష్టంగా చెప్పలేదు గనక ఆయన ఇలాటి నిర్ణయం తీసుకున్నారని బిజెపి ఆరోపిస్తున్నది. మొత్తంమీద ఆయన నితిష్ చర్యను సమర్థించలేదన్నది మాత్రం నిజం.