టెన్నిస్ లో అందాల తారగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రష్యా భామ మరియా షరపోవా ఒకప్పుడు రాకెట్ పట్టి కోర్టులోకి దిగిందంటే ప్రత్యర్థులు చిత్తయిపోయేవారు. ఈ మధ్య వరసగా పరాజయాలు, గాయాలతో ఆమె కెరీర్ తడబడుతోంది. మొన్న యూఎస్ ఓపెన్ లో గాయం పేరుతో హటాత్తుగా తప్పుకొంది. ఒక్క బంతి కూడా ఆడకుండానే టోర్నీకి టాటా చెప్పింది. ఆమె అలా వెళ్లడానికి కారణం బాయ్ ఫ్రెండే అనే వదంతులు వచ్చాయి. ఏమేతేనేం, గాయం కారణంగా అంత పెద్ద టోర్నీకి దూరమైంది. కొంత కాలం విశ్రాంతి తీసుకుని మళ్లీ బరిలోకి దిగింది. డబ్ల్యు టి ఎ టోర్నీలో ఈ అందాల తార దూకుడు గేమ్ ను చూసి ఆస్వాదించాలని వచ్చిన అభిమానులకు నిరాశే ఎదురైంది. మరోసారి గాయం అవాంతరంగా మారింది.
చైనాలో వుహాన్ ఓపెన్ టోర్నీ మొదటి మ్యాచ్ లో మూడో రౌండ్ ఆడుతూ గాయపడింది. రిటైర్డ్ హర్ట్ గా గేమ్ కు బైబై చెప్పి బయలకు వచ్చేసింది. చెక్ ప్రత్యర్థితో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ మొదటి గేములో షరపోవా హోరాహోరీగా పోరాడి 7-6 తేడాతో నెగ్గింది. రెండో సెట్లో చెక్ భామ 7-6తో విజయం సాధించింది. కీలకమైన మూడో గేములో షరపోవా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇంతలో ఎడమచేతి నొప్పి భరించరానిదిగా మారడంతో గేమ్ ఆపేసింది. కాసేపు కుర్చీలో కూర్చుని సేదదీరింది. తర్వాత తాను ఆడలేనని చెప్పి ప్రత్యర్థికి షేక్ హ్యాండ్ ఇచ్చి స్టేడియం నుంచి వెళ్లిపోయింది.
త్వరలో సింగపూర్లో జరిగే టోర్నీకి పూర్తి ఫిట్ నెస్ తో వెళ్తానని మరియా షరపోవా చెప్పింది. గాయాల బెడద నుంచి బయటపడి విజయపథంలో దూసుకుపోవడానికి మరోసారి సర్వశక్తులూ ఒడ్డి తన స్థాయి ఆటతో అభిమానులను అలరిస్తానని చెప్తోందీ రష్యా భామ.