‘శతమానం భవతి’ కోసం తొలిసారి జోడీ కట్టారు శర్వానంద్ – అనుపమ పరమేశ్వరన్. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకొంది. మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరూ కలసి నటించబోతున్నారు. శర్వానంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా మొదలెడతారు. ఇందులో కథానాయికగా అనుపమని ఎంచుకొన్నారు. ఇటీవలే అనుపమని చిత్రబృందం సంప్రదించింది. ఇందులో నటించడానికి ఆమె అంగీకారం తెలిపారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
ఇటీవల ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ లో కనిపించింది అనుపమ. ఆ సినిమాలో తన పాత్ర చిన్నదే అయినా, యూత్ ని బాగా ఆకట్టుకొంది. దాంతో టాలీవుడ్ దృష్టి మళ్లీ అనుపమపై పడింది. శర్వానంద్ చేతిలో రెండు సినిమాలున్నాయి. నారీ నారీ నడుమ మురారితో పాటు, అభిలాష్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు. రెండు సినిమాల షూటింగులూ సమాంతరంగా జరుగుతున్నాయి. ‘నారీ.. నారీ’ దాదాపుగా పూర్తి కావొచ్చింది. అందుకే సంపత్ నంది సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సంపత్ నంది ఈలోగా ‘ఓదెల 2’ అనే చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు ఆయన నిర్మాత మాత్రమే. తమన్నా ప్రధాన పాత్రధారి. ఏప్రిల్ లో ఈ చిత్రం విడుదల కానుంది.