రామాయణంలో పిడకల వేట అంటే ఇంచుమించుగా ఇలాంటిదే కావొచ్చు. శాసనసభ బుధవారం యావత్తుగా అమరావతి భూముల దందాలకు సంబంధించిన ఆరోపణలు, ప్రత్యారోపణలు…. సవాళ్లు- ప్రతిసవాళ్లతో హోరెత్తిపోయింది. ఇదంతా మెయిన్ రామాయణం వంటి సీరియల్ అయితే.. అందులో పిడకలవేట లాంటి ఒక ఆఫ్ బీట్ ఎపిసోడ్ కూడా ఉంది. అది జగన్ అక్రమాస్తులకు సంబంధించి.. ఒక రకంగా ఆయనే ఒప్పుకుంటున్నట్టుగా కనిపించే వ్యవహారం మరి! తన అక్రమార్జనల గురించి జగన్ ఎందుకు స్వయంగా ఒప్పుకుంటాడా అని ఆశ్చర్యపోతున్నారా? ఇంచుమించుగా ఒప్పుకోవడం వంటి ఈ ఎపిసోడ్ వివరాల్లోకి వెళితే..
సాధారణంగా రాజకీయాల్లో నాయకులు తమ ప్రత్యర్థుల మీద అవినీతి ఆరోపణలు చేసినప్పుడు.. మా అవినీతిని నిరూపించినట్లయితే.. ఆ సొమ్ము మొత్తం పేదలకు పంచిపెట్టేస్తాం అంటూ వారు ప్రతిసవాళ్లు చేయడం జరుగుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు మీద అవినీతి ఆరోపణలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ… తన అక్రమార్జనలను ఏమాత్రం నిరూపించినా ప్రతి రూపాయినీ పేదలకే పంచిపెట్టేస్తా అని ఆయన అంటుంటారు. ఆయనొక్కడే కాదు.. ప్రతి నాయకుడూ ఇలాగే అంటారు. మొన్నటికి మొన్న అమరావతి భూముల విషయంలో మంత్రి నారాయణ కూడా ఇలాగే అన్నారు. ఇదంతా చాలా కామన్.
అయితే జగన్ విషయంలో మాత్రం ఒక ట్విస్టు ఉంది. భూదందా గురించి సీబీఐ విచారణను జగన్ అండ్ కో కోరుతూ ఉన్న సంగతి తెలిసిందే. జగన్కు సీబీఐ విచారణ మీద అంత నమ్మకం ఉన్నట్లయితే.. సీబీఐ వారు లెక్క తేల్చిన ప్రకారం.. జగన్ అక్రమార్జనలు 44 వేల కోట్ల రూపాయలు ఉన్నాయని, ఆ అవినీతి సొమ్మును ముందుగా ఆయన ప్రభుత్వ ఖజానాకు చెల్లించి ఆ తర్వాత మాట్లాడాలని తెలుగుదేశం పార్టీ వాళ్లు ఆరోపణలు చేశారు.
అయితే దీనికి జగన్ స్పందన ఏమిటో తెలుసా..? ”తన అక్రమార్జనలు అంటున్నవాటిని నిరూపిస్తే.. ప్రతిరూపాయీ ఇచ్చేస్తా” అని మాత్రం జగన్ ప్రతిజ్ఞలు చేయలేదు. ”ఆ ఆరోపణలు నిరూపించండి.. నాకు అందులో పావలా వాటా ఇవ్వండి.. మిగిలిందంతా మీకే ఇచ్చేస్తా” అని ఆయన అంటున్నారు. అంటే తన అక్రమార్జనలో 11 వేల కోట్ల వరకు దొరికిపోయే అవకాశం ఉన్నదని.. కాబట్టి ఆ మేర పావలా వాటానైనా తాను దక్కించుకోవాలని ఆయనే ఒప్పుకుంటున్నట్లుగా ఈ వాదన ఉన్నది. నాయకులు ఎక్కడైనా తన వద్ద , ప్రత్యర్థులు ఆరోపించినట్లు అవినీతి సొమ్ము ఉంటే.. ప్రతి పైసా ఇచ్చేస్తానంటూ సవాళ్లు చేస్తారు. కానీ జగన్ మాత్రం తన వద్ద ప్రత్యర్థులు చెప్పినట్లు అవినీతి సొమ్ము ఉంటే.. పావలా వాటా తీసుకుని మిగిలింది ఇస్తా అనడమే తమాషా.
ఇక్కడ మరో ట్విస్టు ఉంది. వైకాపా, తెదేపా మంత్రుల మీద ఆరోపించడం ఒక ఎత్తు. కానీ, జగన్ అక్రమాస్తుల గురించి ఆరోపించడం మరో ఎత్తు. ఎందుకంటే.. జగన్ అవినీతి ఆర్జన గురించి 44 వేల కోట్లుగా చెప్పినది ఆరోపణ కాదు.. సీబీఐ తేల్చిన సంగతి. ఆ సొత్తు ఎక్కడెక్కడ ఆస్తు లరూపంలో, పెట్టుబడుల రూపంలో ఉన్నదో వాటిని సీబీఐ ఎటాచ్ చేస్తున్నది కూడా..! ఆనేపథ్యంలో ప్రతిపైసా వెనక్కు ఇచ్చేస్తా.. అని దాని గురించి తాను ప్రతిజ్ఞ చేస్తే తిరుక్షవరం అయిపోతుందని జగన్ భయపడినట్లుగా కనిపిస్తోంది