రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు నిరుద్యోగులు ఉండరు.. రైతుల ఆత్మహత్యలుండవు.. అందరి సమస్యలు ఇట్టే పరిష్కరించేస్తానని.. సీఎం జగన్ … సమయాన్ని మార్చుకుని మరీ చెప్పే డైలాగులు… ఇప్పుడు తెలంగాణలో షర్మిల నోటి వెంట చురుగ్గా వినిపిస్తున్నాయి. ఉద్యోగ దీక్షను షర్మిల మూడు రోజుల పాటు కొనసాగించారు. మూడు రోజుల తర్వాత ఆమె ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు నిరుద్యోగ యువకుల తల్లిదండ్రులను .. కుటుంబసభ్యులను పిలిచి వారి సమక్షంలో ఉద్యో విరమణ చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబాలకు భరోసా ఇచ్చారు. తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకు కూడా భరోసా ఇచ్చారు.
” రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తుంది… ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తా.. ప్రైవేటు రంగంలో లక్షల్లో ఉద్యోగాలు సృష్టిస్తా.. ఏమి చేసైనా సరే నిరుద్యోగ సమస్యను లేకుండా చేస్తానని ” షర్మిల ప్రతిజ్ఞ చేశారు. దీక్, ముగింపు సందర్భంగా షర్మిల కేసీఆర్ సర్కార్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే విపక్షాలపైనా మండిపడ్డారు. విపక్షాలు గాజులేసుకుని కూర్చున్నాయని విమర్శించారు. అదే మహిళనైన తాను ఎదురు నిలబడి పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ఉద్యోగ దీక్ష చేస్తూంటే పాలకులు భయపడ్డారని .. అందుకే.. అడ్డుకునే ప్రయత్నం చేశారని.. జాకెట్ చించేసి.. చేయి విరగ్గొట్టారని మండిపడ్డారు. ఏం చేసినా నిరుద్యోగుల కోసం తాను పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
షర్మిల దీక్షకు తీసుకు వచ్చిన ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలు.. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌కు చెందినవారే. తెలంగాణలో సమస్యలపై షర్మిల దీక్షలు పట్టుదలగా చేస్తున్నారు. ఒక్క రోజే దీక్షకు మద్దతిచ్చినప్పటికీ.. ఆమె ఇంటి దగ్గర దీక్ష కొనసాగించారు. పోలీసుల తీరు ఆమె దీక్షకు మరింత కవరేజీ తెచ్ిచ పెట్టింది. మూడు రోజుల పాటు నిరాటకంగా దీక్ష చేసి.. తాను ఆషామాషీగా రాజకీయం చేయడం లేదని …పట్టుదలగానే చేస్తున్నానని.. నిరూపించే ప్రయత్నం చేశారు. ఈ దీక్షల ఒరవడిని కొనసాగించాలని షర్మిల నిర్ణయించుకున్నారు.