ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే ఎంతగా పోరాడాలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాలను చూస్తే అర్ధం అవుతుంది. ఆయన నిత్యం ఏదో ఒక సమస్య మీద ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటారు. కానీ అదే తెలంగాణాలో మాత్రం వైకాపా అసలు ఉందా లేదా? అనే అనుమానం కలుగుతుంటుంది. కానీ షర్మిల మాత్రం పట్టువదలని విక్రమార్కుడులాగ నేటికీ తెలంగాణాలో పరామర్శ యాత్రలు చేస్తూనే ఉన్నారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి తెలంగాణలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రజలకు ఎంతో మేలు చేసారని, కనుక మళ్ళీ తెలంగాణాలో రాజన్న రాజ్యం వచ్చినప్పుడే తెలంగాణా ప్రజలకు అన్ని విధాల మేలు జరుగుతుందని ప్రజలకి ఆమె చెపుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
తెలంగాణా అసలు తన ఉనికినే చాటుకోలేకపోతున్న వైకాపా తెలంగాణాలో ఏవిధంగా అధికారంలోకి వస్తుందని ఆమె భావిస్తున్నారో తెలియదు కానీ ఆమె చెట్టుపేరు చెప్పుకొని కాయలు అమ్ముకొనే ప్రయత్నం చేస్తున్నారని అర్ధం అవుతోంది. ఒకవేళ తెలంగాణాలో వైకాపాని నిజంగా అధికారంలోకి తీసుకురావాలనుకొంటే అందుకు ఆమె చేస్తున్న ఈ పరామర్శ యాత్రలు ఏ మాత్రం సరిపోవు. కనుక వైకాపాను కేవలం సజీవంగా నిలిపి ఉంచేందుకే ఆమె యాత్రలు చేస్తున్నారని భావించవలసి ఉంటుంది.
కానీ తెలంగాణాలో కూడా తమ పార్టీ కొనసాగిస్తున్నప్పుడు దానిని ఎందుకు బలపరుచుకోవడం లేదు? మిగిలిన అని రాజకీయ పార్టీలు ప్రజా సమస్యలపై పోరాడుతుంటే కేవలం వైకాపా మాత్రమే ఎందుకు ప్రేక్షకపాత్ర వహిస్తోంది? అంటే తెరాస-వైకాపాల మధ్య ఉన్న బలమయిన స్నేహ సంబంధాల కారణంగానే అని చెప్పుకోవలసి ఉంటుంది. కానీ తెరాసతో స్నేహంగా ఉండదలిస్తే, ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉండలచుకొన్నామని బహిరంగంగా ప్రకటించి తెరాస ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించకుండా ఎందుకు మౌనం వహిస్తోంది? అంటే తెరాసతో ఉన్న రహస్య అనుబంధం ఉందని తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణలకే ఆ పార్టీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. ఆంధ్రా ప్రభుత్వానికి, రాష్ట్రానికి నిత్యం అనేక విమర్శలు, సవాళ్లు, సమస్యలు సృష్టిస్తున్న తెరాసతో బహిరంగంగా చేతులు కలిపినట్లయితే ఆంద్రప్రదేశ్ ప్రజలు దానికి మరింత దూరం అయ్యే ప్రమాదం ఉంది. అందుకే తెరాస ప్రభుత్వానికి పరోక్షంగా చాల మద్దతు ఇస్తున్నా బహిరంగంగా ఆ మాట చెప్పుకోలేకపోతోంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో షర్మిల అంత కష్టపడి తెలంగాణాలో పరామర్శయాత్రాలు ఎందుకు చేస్తున్నట్లు అంటే మళ్ళీ అదే సమాధానం-పార్టీని సజీవంగా నిలిపి ఉంచడానికి అని చెప్పుకోవలసి ఉంటుంది.
కానీ దాని వలన వైకాపాకు ఏమి లాభం అంటే తమ ఉమ్మడి శత్రువు అయిన తెదేపాను తెలంగాణాలో దెబ్బ తీయడానికి అది అత్యవసరం అందుకేనని అనుమానించవలసి వస్తోంది. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు హైదరాబాద్ మరియు తెలంగాణాలో ఉన్న ఆస్తులు కాపాడుకోవడానికి కూడా ఇదొక రక్షణ కవచంలా ఉపయోగపడుతుంది. వైకాపా ఎలాగూ తెలంగాణాలో అధికారంలోకి వచ్చే ఉద్దేశ్యం, అవకాశం రెండూ లేవు కనుక షర్మిల చేస్తున్న పరామర్శ యాత్రలను, రాజకీయ ప్రసంగాలను తెరాస కూడా పట్టించుకోవడంలేదు. కానీ వైకాపా అధిష్టానం అనుసరిస్తున్న ఈ వైఖరి వలన తెలంగాణాలో ఆ పార్టీని నమ్ముకొన్న నేతలు, కార్యకర్తలు బలయిపోయే ప్రమాదం ఉంది. కొండా సురేఖ వంటివారు అందుకు సజీవ సాక్ష్యాలుగా మన కళ్ళెదుటే ఉన్నారు.తెలంగాణాలో వైకాపా తీరు చూస్తుంటే రాజుగారు ఏడు చేపల కధ గుర్తుకు వస్తుంది. చేపలు ఎందుకు ఎండలేదు అనే ప్రశ్నకి గొలుసు ప్రశ్నలు వేసుకొంటూపోతే చివరికి చీమ కుట్టినందునే ఎండలేదని చెప్పుకొన్నట్లుంది.