తెలంగాణకు కాబోయే సీఎం తానేనని నిర్మోహమాటంగా ప్రకటిస్తున్నారు వైఎస్ షర్మిల, ఆమెలో ఆ కాన్ఫిడెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్‌లో అరెస్ట్ వ్యవహారం తర్వాత షర్మిలలో ఇంకా నమ్మకం పెరిగిపోయింది. రెండు రోజులుగా మీడియాకు ఇంటర్యూలు ఇస్తూ.. అసలు తాను ఎందుకు సీఎం కాలేనన్నట్లుగా చెబుతున్నారు. ప్రజలందరూ డిసైడైపోయారని.. వచ్చే ఎన్నికల్లో తననే సీఎంను చేస్తారని చెబుతున్నారు. ఇంకా విశేషం ఏమిటంటే.. తాను కాంగ్రెస్, బీజేపీల్లో చేరితే తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించేవారని.. కానీ రాజన్నబిడ్డగా వేరే పార్టీల్లో చేరడం ఏమిటని పార్టీ పెట్టుకున్నానని చెబుతున్నారు.
కేఏ పాల్ కూడా ఇంచు మించుగా ఇదే చెబుతారు. ఆయన తన కాన్ఫిడెన్స్‌ను మాటల్లో కాకుండా చేతల్లో చూపించే ప్రయత్నం చేస్తారు. ఏ ఎన్నికలొచ్చినా పోటీ చేస్తారు. కానీ షర్మిల మాత్రం పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసే ప్రయత్నం చేయలేదు. అసలు షర్మిలకు పోటీ చేయడానికి ఒక్క అభ్యర్థి కూడా లేరు. తెలంగాణ మొత్తం రెడ్డి సామాజికవర్గం మెజార్టీ ఎక్కడ ఉన్నారో వెదుక్కుని పాలేరులో పోటీ చేస్తానని ప్రకటించారు. ఆమెను అక్కడ ఆదరిస్తారా లేదా అన్నదానపై సవాలక్ష అనుమానాలున్నాయి. పోటీ చేయడానికి ఆ పార్టీకి అభ్యర్థులు కూడా లేరు.
అయినా ఆమె ప్రకటనలు చూసి తెలంగాణ రాజకీయ పార్టీలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. మరీ ఇంత ఓవర్ కాన్పిడెన్స్ కేఏ పాల్ కేటగరిలో ఆమెను చేర్చే పరిస్థితి ఏర్పడుతోంది. తెలంగాణ ప్రజలు ఇప్పటికీ వైఎస్ఆర్టీపీని రాజకీయ పార్టీగానే పరిగణించడం లేదు. సంప్రదాయ రాజకీయ పార్టీల మధ్య ఓటర్లు చీలిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల ఎందుకు ఇలా వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా ప్రకటనలు చేస్తున్నారో చాలా మందికి వింతగానే ఉంది.