వైఎస్ జగన్ బొత్సను తన తండ్రి సమానుడు అని అనడం.. ఆయన విచిత్రమైన హావభావాలతో కంట తడిపెట్టుకున్నట్లుగా నటించడం, తర్వాత కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేయడం విజయనగరం సిద్ధం సభలో కనిపించిన సన్నివేశం. దీన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. గతంలో బొత్స సత్యనారాయణ .. అసెంబ్లీలో విజయమ్మను అవమానించిన దృశ్యమే ఎక్కువ మందికి గుర్తుకు వచ్చింది. అలాంటి బొత్సను తండ్రి సమానుడు అనేశారు జగన్.
వైసీపీ నేతలకు ఈ పోలిక నచ్చిందేమో కానీ.. షర్మిలకు మాత్రం నచ్చలేదు. రేపల్లె ఎన్నికల ప్రచారంలో ఆమె జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఇదే బొత్స సత్యనారాయణ రాజశేఖర్ రెడ్డిని తాగుబోతు అని తిట్టారని.. జగన్మోహన్ రెడ్డికి ఉరి శిక్ష వేయాలని కూడా అన్నారని గుర్తు చేశారు. ఆఖరికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మను కూడా బొత్స అవమానించారన్నారు. అలాంటి బొత్స . . ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నాన్నలాంటి వారయ్యారా అని ప్రశ్నించారు. ఒక్క బొత్స మాత్రమే కాదని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గంలో వైఎస్ఆర్ ను అభిమానించే వారే లేరన్నారు. వైఎస్ పై అభిమానం ఉన్న వాళ్లు.. ఆయనను గౌరవించేవారు కేబినెట్ లో లేరన్నారు. మంత్రులు అందరూ రాజశేఖర్ రెడ్డిని తిట్టిన వాళ్లేనన్నారు. వైఎస్ ను తిట్టిన వాళ్లే మంత్రులుగా ఉన్నారన్నారు.
ఇదంతా చెప్పిన తర్వాత షర్మిల మరో అంశం కూడా చెప్పారు. అదేమిటంటే… ఆయన తండ్రి సమానుడు అయ్యాడు కానీ జగన్ కోసం పాదయాత్రలు చేసిన వాళ్లు.. గొడ్డలి పోటుకు గురైన వాళ్లు ఏమీ కాకుండా పోయారని నిష్ఠూరమాడారు. జగన్ అందర్నీ దూరం చేసుకుని తల్లి, చెల్లి సహా అందరితో సంబంధాలు చెడగొట్టుని బయట రాజకీయ అవసరాల కోసం నా చెల్లి లాంటివారు.. నా తండ్రి లాంటి వారు అని ఇతరులతో ముఖ్యంగా గతంలో రాజకీయాల కోసం తిట్టిన బొత్స లాంటి వారితో సంబంధాలు కలుపుకోవడం.. వైసీపీ క్యాడర్ కు కూడా ఎబ్బెట్టుగా మారింది.