వైఎస్ షర్మిల రాజకీయం అపరిపక్వతతో కనిపిస్తోంది. వైసీపీ ట్రాప్ లో ఆమె రాజకీయం కొనసాగుతున్నట్లు ఉందనే అభిప్రాయం గట్టిగానే వినిపిస్తోంది. తప్పు వైసీపీదే అయినా.. దాన్ని టీడీపీకి మిక్స్ చేసి చెప్పడం ఆమె మ్యానరిజంగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది. టీడీపీని వదిలేసి వైసీపీపై విమర్శలు చేస్తే తన పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడుతుందన్న భయంతో పాలిటిక్స్ చేస్తున్నట్టు ఉన్నారు షర్మిల.
జగన్ రెడ్డి సతీమణి , తన వదిన భారతి రెడ్డిపై కిరణ్ చేబ్రోలు అనే కార్యకర్త చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ఖండించిన షర్మిల.. నీచంగా మాట్లాడిన సైకోలను నడిరోడ్డు మీద ఉరితీయాలని ఆవేశపూరిత ట్వీట్ చేశారు. తప్పుడు కూతలు కూసిన వెధవలను, రేటింగ్స్ కోసం ఎంటర్ టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందేనని పేర్కొన్నారు.
అయితే, వ్యక్తిగతంగా నీచంగా మాట్లాడుతూ వ్యక్తిత్వ హననానికి పాల్పడే విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీనేనని తేల్చారు షర్మిల. అందులో టీడీపీ పాత్ర కూడా ఉందంటూ చెప్పుకొచ్చారు. అసభ్యకరంగా పోస్టులు, వీడియోలు పెట్టే సైతాన్ సైన్యానికి ఈ రెండు పార్టీలే ఆదర్శమన్నారు.
గతంలో టీడీపీ హయాంలో ఇంతటి జుగుప్సాకరమైన వీడియోలు కనిపించలేదు. జగన్ అధికారంలోకి వచ్చాకే రాజకీయాల్లో ఈ కొత్త సంస్కృతి ప్రారంభమైంది. వాటిని జగన్ ఎంకరేజ్ చేశారు. నోటికి వచినట్లు మాట్లాడిన నేతలకు పదవులను కట్టబెట్టారు. ప్రభుత్వం మారాక.. ఇలాంటి వాటిని సహించబోమని చంద్రబాబు ప్రకటించారు.
ప్రకటించడం కాదు.. చేతల్లో చేసి చూపించారు. సొంత పార్టీ కార్యకర్త అయినా ఉపేక్షించవద్దని కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కిరణ్ అరెస్ట్ ద్వారా గట్టి హెచ్చరికలే పంపారు చంద్రబాబు. ఎవరైనా హుందాగా మాట్లాడాల్సిందేనని సంకేతాలు పంపారు. అయినా, చంద్రబాబు తీసుకున్న చర్యలను అభినందించకుండా.. సైతాన్ చేష్టలకు బీజం వేసింది వైసీపీతోపాటు టీడీపీ అని కలిపి చెప్పడం.. షర్మిల ఫియర్ పాలిటిక్స్ కు సంకేతమని అంటున్నారు.
మంచి చేసినప్పుడు తప్పక అభినందించాలి.. కాని , తనకు ఎదురయ్యే క్లిష్టమైన పరిస్థితిని అంచనా వేసి , మంచిని అభినందించకుండా విమర్శలు చేయడం అవివేకమే అవుతుంది.. షర్మిల ఈ విషయం ఎప్పుడు తెలుసుకుంటారో..ఈ విషయం తెలుసుకున్నప్పుడే ఆమె అసలు రాజకీయం ప్రారంభం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.