ఉద్యోగ దీక్షను మూడు రోజులు చేయాలనుకున్న షర్మిల ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేయడం వివాదాస్పదమవుతోంది. ఆమెను ఇంటికి తరలించే ప్రయత్నంలో పోలీసులు అనుచితంగా ప్రవర్తించడం… బలవంతంగా పోలీస్ వ్యాన్‌లో తీసుకొచ్చి ఇంటిదగ్గర విడిచి పెట్టడంతో షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోటస్ పాండ్‌లోనే ఆమె దీక్ష కొనసాగిస్తున్నారు. ఉదయం ఇందిరాపార్క్‌లో ఆమె దీక్ష ప్రారంభించారు. మామూలుగా మూడు రోజులు చేయాలనుకున్నారు. కానీ పోలీసులు సాయంత్రం ఐదు గంటల వరకే చాన్సిచ్చారు. ఐదు గంటల తర్వాత కూడా షర్మిల దీక్షా శిబిరం నుంచి కదలకపోవడంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేశారు. నిరసనగా షర్మిల పాదయాత్రగా… లోటస్ పాండ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నడుచుకుంటూ తెలుగుతల్లి ప్లైఓవర్ వద్దకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు పర్మిషన్ లేదని.. వాహనంలో ఎక్కాలని ఒత్తిడి చేశారు. దానికి షర్మిల అంగీకరించలేదు. దాంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో షర్మిల సొమ్మసిల్లిపడిపోయారు. తర్వాత పోలీసులు ఆమెను పైకి లేపి.. వాహనంలో ఎక్కించి తరలించారు. నేరుగా లోటస్ పాండ్ ఇంటికి తీసుకు వచ్చి విడిచి పెట్టారు. తోపులాటలో షర్మిల చేయికి గాయం అయింది.
ప్రత్యేక వైద్య బృందం వచ్చి ఆమెకు చికిత్స చేసింది. లోటస్ పాండ్ వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుని… పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంకోసారి తన మీద చెయ్యి పడితే ఊరుకోనని షర్మిల హెచ్చరికలు జారీ చేశారు. షర్మిలకు గాయంపై ఆమె తల్లి విజయలక్ష్మి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రికి వెళ్లాలని సలహా ఇచ్చారు. కానీ షర్మిల అంగీకరించలేదు. దీక్ష కొనసాగించాలని నిర్ణయించారు.