ఏపీ రాజకీయాల్లోకి షర్మిల వస్తున్నారంటూ గత రెండు,మూడు రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఏపీకి ప్రత్యేకహోదాకు మద్దతిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. అమరావతికి కూడా రాహుల్ మద్దతిచ్చారని అంటున్నారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన కేవీపీ రామచంద్రరావు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆయన అంతర్గత సంభాషణల్లో షర్మిల ఏపీలో కాంగ్రెస్ సారధ్యం వహిస్తున్నారని చెబుతున్నారు.
షర్మిలకు తెలంగాణలో కనిపించని రాజకీయ భవిష్యత్
షర్మిల ఇప్పటికీ కాంగ్రెస్ లో లేరు. సొంత పార్టీతో తెలంగాణ రాజకీయాల్లో అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నారు. మూడు వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. కాంగ్రెస్ పార్టీలో విలీనమవ్వాలనుకున్నారు. కానీ ఆమె చేరిక బీఆర్ఎస్ కు ఆయుధం ఇచ్చినట్లుగా అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి అడ్డుకున్నారని అంటారు. అందుకే రేవంత్ పై షర్మిల విమర్సలు కూడా చేశారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయం అంతా రేవంత్ చుట్టే తిరుగుతోంది. అంటే షర్మిలకు తెలంగాణ రాజకీయాల్లోకి నో ఎంట్రీ అన్నమాటే.
ఏపీలో అయితే షర్మిలకు మద్దతు
షర్మిల రాజకీయ భవిష్యత్ ను సీరియస్ గా తీసుకుంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనమయి.. ఏపీ లో రాజకీయం చేయడం ఒక్కటే మార్గం. రేవంత్ రెడ్డి కూడా గతంలో అదే చెప్పారు. ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటే.. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కొంత మేరకు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సరైన నేత లేకపోవడం వల్లనే క్యాడర్ అంతా జగన్మోహన్ రెడ్డిపార్టీ వైసీపీతో వెళ్లిపోయారు. రాష్ట్ర విభజన వల్లనే ఏపీలో కాంగ్రెస్ చతికిలపడిందని కొంత మంది చెబుతారు.. కానీ జగన్ మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకోవడం వల్లనే కాంగ్రెస్ భూస్థాపితమయిందనేది నిజమని భావిస్తారు.
ఎన్నికలకు ముందు జగన్ కు బెదిరింపా ?
మరో వైపు ఎన్నికలకు మూడు నెలల ముందు ఇలా ఏపీలో షర్మిల ప్రస్తావన తీసుకు రావడం జగన్ కు బెదిరింపు అన్న భావన కూడా వినిపిస్తోంది. ఈ సారి ఎన్నికల్లో భారీగా మార్పులు చేర్పులతో ప్రయోగాలు చేస్తున్నారు. ఆదరణ దక్కని నేతలంతా కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా నినాదంతో కాంగ్రెస్ .. షర్మిల నాయకత్వంలో ఏపీలో అడుగు పెడితే రాజకీయాల్లో కీలక మార్పులు చేుకుంటాయని అంచనా వేస్తున్నారు.