తాను తప్పకుండా త్వరలోనే తెలంగాణ సీఎం అవుతానని మొన్నామధ్య దీక్షలో తన కోరిక బయటపెట్టుకున్న షర్మిల, తన దీక్షకు తాత్కాలికంగా బ్రేకులు వేశారు. కరోనా నియమ నిబంధనలు ఏమాత్రం పాటించకుండా బాధ్యతా రహితంగా ఆవిడ దీక్ష చేపట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో, తన దీక్ష వల్ల అనుచరులకు చాలామందికి కరోనా సోకి ప్రాణాల మీదకు రావడం తో, తప్పనిసరి పరిస్థితుల్లో దీక్షకు బ్రేక్ ఇచ్చింది షర్మిల. వివరాల్లోకి వెళితే ..
తెలంగాణలో తగినన్ని ఉద్యోగ ప్రకటనలు వేయడం లేదంటూ నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది అంటూ, షర్మిల ఆ మధ్య దీక్ష తలబెట్టింది. దీక్షకు చాలా మంది జనం తరలి వచ్చారు. పోలీసులు అనుమతించిన సమయానికి మించి షర్మిల అక్కడే ఉండటంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆవిడ దీక్ష ని విరమించడానికి ప్రయత్నించగా, అక్కడ డ్రామా పండించారు షర్మిల. దీంతో పరిస్థితులు కాస్త ఉద్రిక్తంగా మారాయి. కాస్త తోపులాట కూడా జరిగింది. ఆ తర్వాత రిలే దీక్షలను ప్రకటించారు షర్మిల. అయితే తన దీక్ష సందర్భంగా ఎటువంటి కరోనా నియమ నిబంధనలు పాటించకుండా దీక్షలు చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. షర్మిల సైతం కొన్ని సందర్భాలలో మాస్క్ పెట్టుకోకుండా మీడియాతో మాట్లాడటం గమనార్హం. అయితే ఈ మొత్తం వ్యవహారం కారణంగా షర్మిల అనుచరుల కే కాకుండా , దీక్షకు హాజరైన వారిలో చాలామందికి కరోనా వైరస్ సోకింది. వారిలో చాలామంది ప్రస్తుతం మృత్యువు తో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఈ దీక్ష కొనసాగిస్తే మైలేజ్ రాకపోగా తన రాజకీయ భవిష్యత్తు కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతుంది అంటూ తన ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందనే విమర్శలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. బహుశా ఈ కారణంగానే షర్మిల తన దీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పరిస్థితులు సద్దుమణిగాక దీక్షను కొనసాగిస్తానని ఆవిడ ప్రకటించారు.
మరొకవైపు తమ వైపు రానటువంటి మైనారిటీ ఓట్లను కేసీఆర్ వైపు పూర్తిగా వెళ్ళిపోకుండా , వాటిని చీల్చే ఉద్దేశంతో బిజెపి యే షర్మిలతో పార్టీ పెట్టించిందని, అదేవిధంగా బిజెపి చేస్తున్న ఈ ప్రయత్నానికి జగన్ ఆమోదం కూడా ఉందని , కానీ పైకి మాత్రం జగన్ షర్మిలల మధ్య విభేదాలు ఉన్నట్లు ప్రజలను మభ్యపెడుతున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి షర్మిల తన దీక్షను ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారు, తన రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అన్నది వేచిచూడాలి.