సెప్టెంబర్ 30వ తేదీ లోపు విలీనంపై ఏదో ఒకటి తేల్చాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ హైకమాండ్ కు డెడ్ లైన్ పెట్టారు. కాంగ్రెస్ ఏమీ చెప్పకపోతే అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తామని.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా అన్ని స్థానాల్లో పోటీ చేసే దమ్ము ఉందని షర్మిల చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించాలని.. తన పార్టీని విలీనం చేయాలని షర్మిల చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆమె వస్తే మన నెత్తి మీద మనం చేయి పెట్టుకున్నట్లేనని వద్దే వద్దని తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా అడ్డుకున్నారు.
చివరికి తెలంగాణ కాంగ్రెస్ లో తెర వెనుక కీలక పాత్ర పోషిస్తున్న డీకే శివకుమార్ వంటి వారు కూడా ఏమీ చేయలేకపోయారు. అసలు విలీనం ప్రతిపాదనను ఆయనే ముందుకు తీసుకెళ్లారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న… అందర్నీ పార్టీలో చేర్చుకుంటున్నా షర్మిల గురించి మాత్రం ఏమీ చెప్పడం లేదు. దాంతో కాంగ్రెస్ హైకమాండ్ పై ఒత్తిడి పెంచేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ముఫ్పై మూడు జిల్లాల పార్టీ అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని… అందరికీ ఇదే సందేశం ఇచ్చారని మీడియాకు సమాచారం.
షర్మిల పార్టీకి అసలు నిర్మాణమే లేదు. జిల్లా ల పార్టీ అధ్యక్షుల్ని నియమించారో లేదో కూడా ఎవరికీ తెలియదు. షర్మిల పార్టీ పెట్టినప్పటి నుండి వెంట ఉన్న కొండా రాఘవరెడ్డి, ఏపూరి సోమన్న, ఇందిరాశోభన్ వంటి వాళ్లు వరుసగా ఒకరి తర్వాత ఒకరు వెళ్లిపోయారు. కాంగ్రెస్ లో విలీనం ఎటూ తేల్చకపోతే… అక్టోబర్ రెండో వారం నుంచి ప్రజల్లోకి వెళదామని.. షర్మిల పార్టీ నేతలకు భరోసా ఇచ్చారు.