తెలంగాణకు దక్కాల్సిన చుక్కనీటిని కూడా వదులుకోబోమని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. హైదరాబాద్ వేదికగా ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఆవిష్కరించారు. కరోనా నిబంధనలు ఏమీ లేకపోయినప్పటికీ.. గతంలో అనుకున్న బహిరంగసభ ద్వారా పార్టీని లాంఛ్ చేసేందుకు సమయం సరిపోకపోవడం హైటెక్ పద్దతిలో పార్టీని ప్రారంభించారు. ప్రధాన వేదిక వద్ద పదిహేను వందల మందికే అవకాశం కల్పించారు. జిల్లాల వారీగా మరో లక్ష మంది పాల్గొనేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. నదీ జలాల అంశంపై తన అభిప్రాయాన్ని స్పష్టంగానే వివరించారు. ఏపీ సర్కార్ కృష్ణా నదిపై రెండేళ్ల నుంచి ప్రాజెక్టులు కడుతుంటే.. కేసీఆర్‌కు ఇప్పుడే తెలివి వచ్చిందా అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం సీఎంను పిలిపించుకుని భోజనం పెట్టినప్పుడు తెలియదా అని నిలదీశారు. 2 నిమిషాలు కూర్చొని నీటి పంచాయితీని మాట్లాడుకోలేరా అని మండిపడ్డారు. సమస్యను పరిష్కరించాలని కేంద్రానికీ చిత్తశుద్ధి లేదన్నారు. గోదావరి నది మీద ప్రాణహిత నుంచి పోలవరం వరకు. కృష్ణా నది మీద జూరాల నుంచి పులిచింతల వరకు న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన చుక్కనీటిని కూడా వదులుకోబోమని.. ఇరుప్రాంతాలకు సమన్యాయం జరగాలన్నది వైఎస్సార్ టీపీ సిద్ధాంతమని షర్మిల ప్రకటించారు.
కేసీఆర్‌పైనా విమర్శలు గుప్పించారు. దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని లేకపోతే తల నరుక్కుంటానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని..మరి తల ఎక్కడ అని ప్రశ్నించారు. సంపద సృష్టించడం అంటే అప్పులు చేయడం కాదనన్నారు. బీసీలు పైకి వస్తే ఓటు బ్యాంక్ రాజకీయం నడవదని దూరం పెడుతున్నారని.. తమ పార్టీలో సగం సీట్లు మహిళలకే కేటాయిస్తామని ప్రకటించారు. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు అని చెప్పి ఏడేళ్లయింది కానీ అమలు చేయలేదన్నారు. 1200 మంది ఉద్యమంలో చనిపోతే కేసీఆర్ కేవలం 400 మందినే గుర్తించారని… ఉద్యమకారులపై కేసులు ఇంత వరకు ఎత్తివేయలేదని మండిపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధులను గుర్తించినట్లు ఉద్యమకారుల్ని గుర్తిస్తామని హామీ ఇచ్చారు. వంద రోజుల్లో పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించారు.
అంతకు ముందు తల్లి విజయలక్ష్మి కూడా మాట్లాడారు. తమ పిల్లలు చెరో రాష్ట్రానికి ప్రతినిధులని.. అది దైవ నిర్ణయమని చెప్పుకొచ్చారు. తమ బిడ్డలు దోచుకుని దాచుకునేవాళ్లు కాదని.. పంచిపెట్టేవాళ్లని చెప్పుకొచ్చారు. ఆవిర్భావ కార్యక్రమం… ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది. కార్పొరేట్ ఈవెంట్స్ ఎక్కువగా జరిగే వేదిక కావడంతో.. అలానే కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. షర్మిల కుటుంబసభ్యులతో పాటు వైఎస్ ఫ్యామిలీకి చెందిన పలువురు హాజరయ్యారు. అయితే షర్మిల ప్రసంగం.. పెద్దగా ఆకట్టుకోలేదు. రేవంత్ రెడ్డి ప్రసంగంతో ఎక్కువ మంది పోల్చుకున్నారు. అయితే అదే సమయంలో జగన్ .. చిన్న ప్రసంగం అయినా చూసి చదువుతారని.. కానీ.. షర్మిల మాత్రం ప్రసంగం అసాంతం.. చూడకుండానే ప్రసంగించారు. అన్ని విషయాలను గుర్తు పెట్టుకున్నారు. పెద్దగా ఎక్కడ తడబడలేదు.