వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదలడం లేదు. ఏ మాత్రం పుంజుకుంటున్నట్లుగా కనిపిస్తున్నా… వెంటాడి.. వెటాడేందుకు ఆయన సంతానం సిద్ధమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఓ రాష్ట్రంలో పార్టీని ఆయన కుమారుడు సొంత ఆస్తిలాగా మార్చేసుకున్నారు. మరో రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పార్టీని మళ్లీ పాత స్థాయికి తీసుకెళ్లేందుకు కుమార్తె రంగంలోకి దిగారు. పార్టీ హైకమాండ్ ఏం ఆలోచిస్తుందో తెలియడం లేదు కానీ.. షర్మిలను పార్టీలోకి తీసుకుంటే అంత కంటే దారుణం ఏమీ ఉండదని.. ఏపీ రాజకీయాల్లోకి తీసుకుంటేనే పార్టీకి మేలు అని హైకమాండ్ కు నివేదికలు ఇస్తున్నారు.
అయితే షర్మిల మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంతు తేల్చేదాకా నిద్రపోను అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాను తెలంగాణ కాంగ్రెస్ లో విలీనం అవుతానని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు వద్దు అని హైకమాండ్ కు మొరపెట్టుకుంటున్నారు. పార్టీని సొంతం చేసుకున్న జగన్ రెడ్డికి చెక్ పెట్టి… మళ్లీ పార్టీని బతికించుకోవాలంటే ఏపీకి షర్మిల వెళ్లాలని తెలంగాణకు వస్తే… అది కుట్రపూరితమేనని… కావాలనే కాంగ్రెస్ లోకి పంపుతున్నారని కాంగ్రెస్ నేతలు హైకమాండ్ కు చెబుతున్నారు.
అన్నతో గొడవలు ఉంటే… తెలంగాణలో ఎందుకు రాజకీయాలు చేస్తారని… ఏపీలోనే రాజకీయాలు చేసి తన బలాన్ని ప్రదర్శిస్తారని గుర్తు చేస్తున్నారు. అయితే ఎంతో కొంత ఎదుగుతున్న కాంగ్రెస్ పార్టీని మళ్లీ పడుకోబెట్టే ప్లాన్ తోనే మరోసారి ఇతర పార్టీల షర్మిల బాణాన్ని ప్రయోగించాయని… మరోసారి వైఎస్ వారసుల చేతుల్లో మోసపోవద్దని హైకమాండ్ కు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి హైకమాండ్ పట్టించుకుంటుందా ?. భస్మాసుర హస్తంలా నెత్తి మీద చేయి పెట్టుకుంటుందా ?