వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల మంగళవారం లోటస్‌పాండ్‌లో సన్నిహితులు, శ్రేయోభిలాషులతో ఆత్మీయ సమావేశం నిర్వహించబోతున్నారు. తెలంగాణలో ఆమె సొంత పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా కొంత కాలంగా వార్తలొస్తున్నాయి. లోటస్ పాండ్‌లో ఒక్క జగనమోహన్ రెడ్డి నివాసం మాత్రమే కాదు… షర్మిల నివాసం కూడా ఉంది. అందులోనే సమావేశం నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో పార్టీ ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లను షర్మిల చేసుకున్నారని తెలుస్తోంది.
కలసి వచ్చే నేతలు.. వైఎస్‌తో అత్యంత సన్నిహితంగా మసలిన వారి అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. రెండు రోజుల పాటు .. హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న ఓ హోటల్లో ఈ అంశంపై సుదీర్ఘమైన చర్యలు జరిగాయని చెబుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీ… ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ కీలక నేత .. ఇలా చాలా మంది షర్మిలతో వచ్చి చర్చలు జరిపినట్లుగా చెబుతున్నారు. తొమ్మిదో తేదీన ఆమె ముందుగా నిర్ణయించుకున్నట్లుగా పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక వేళ ఏదైనా ఒత్తిళ్ల కారణంగా పార్టీని ప్రకటించకబోయినా ఆమె.. రంగంలోకి దిగినట్లుగానే చెబుతున్నారు. అన్నింటినీ సర్దుబాటు చేసుకుని ఆమె పార్టీని ప్రకటించి చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా అత్యంత విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.
ఆత్మీయ సమావేశానికి ఎవరెవరు హాజరవుతారన్నది ఆసక్తికరంగా మారింది. షర్మిల రాజకీయ పార్టీ పెడతారని వచ్చినప్పుడు ఓ ఖండన ప్రకటన వచ్చింది. కానీ ఆ ప్రకటనలోనూ పార్టీ .. రాజకీయ వ్యూహం గురించి లేదు. దాంతో అప్పుడే ఆమె పార్టీ పెట్టబోతున్నట్లుగా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నిజం అవుతోంది. ఆమె పార్టీని కొంత మంది బీజేపీ వ్యూహంగా.. మరికొంత మంది కేసీఆర్ స్కెచ్‌గా అభివర్ణిస్తున్నారు. ఎవరి ప్రోద్భలంతో షర్మిల రాజకీయ ప్రవేశం చేస్తున్నారో.. తెర వెనుక ఎవరు ఉన్నారో.. ఆమె రాజకీయ లక్ష్యాలేమిటో మాత్రం స్పష్టత లేకుండా పోయింది.