వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. రెండు వేల కిలోమీటర్లు దాటిపోయింది. కానీ పట్టించుకుంటున్న నాథుడే లేడు. తన వెంట ఉన్న అనుచరులు.. ముందుగానే ఖర్చు పెట్టి చేస్తున్న జనసమీకరణ తప్ప పట్టుమని పది మంది కూడా పాదయాత్రలో ఉండటం లేదు. వనపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతోంది. అక్కడే రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసి పైలాన్ ఆవిష్కరించారు. వైఎస్ విజయమ్మ ఈ పైలాన్ ఆవిష్కరించారు.
వైఎస్సార్‌లా తెలంగాణ కూడా స్వచ్ఛమైంది. మీ ప్రేమ, ఆప్యాయతలతోనే షర్మిల 2వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేయగలిగింది. నడిచింది షర్మిలే అయినా.. నడిపించింది మీరే అని ఎప్పటిలాగే సెంటిమెంట్ డైలాగులు చెప్పారు. గత ఏడాది అక్టోబర్ 20న చేవెళ్ల నుంచి ప్రారంభం అయిన ప్రజా ప్రస్థానం ప్రారంభమయింది. మధ్యలో కరోనా కారణంగా.. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా… మరోసారి అమెరికా పర్యటన కారణంగా విరామం ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం,నల్గొండ జిల్లాలను ముగించుకొని మహబూబ్ నగర్ లో పాదయాత్ర చేస్తున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైలుకు వెళితే తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అప్పట్లో షర్మిల పాదయాత్రకు విస్తృతమైన ప్రచారం లభించింది. కానీ ఇప్పుడు ఆమెను పట్టించుకుంటున్న వారు లేరు. మీడియాలో హైప్ రావడానికి సీఎం కేసీఆర్‌పైనా ఆయన ఘాటు భాషను ప్రయోగిస్తున్నారు. పాదయాత్రను పూర్తి చేసి రాజన్న బిడ్డంగా తెలంగాణలో .. రాజన్న రాజ్యం తెచ్చేలా ప్రజల్ని ఒప్పిస్తానని ఆమె నమ్మకంతో ఉన్నారు. కానీ రాజన్న బిడ్డను పట్టించుకునేంత తీరిక తెలంగాణ ప్రజలకు లేకపోయింది.