వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కొంత కాలంగా ట్వీట్లతో టైంపాస్ చేస్తున్నారు. కానీ ఆమె తన పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ లో విలీనం చేయాలని పట్టుదలగా ఉన్నారు. గతంలో డీకే శివకుమార్ ద్వారా చర్చలు జరిపినా… తెలంగాణ నేతలు షర్మిల అవసరం లేదని.. ఆమెను ఏపీ పీసీసీ చీఫ్ గా నియమిస్తే అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా తాము అంగీకరించే ప్రశ్నే లేదని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. షర్మిలకు మద్దతుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి డీకే శివకుమార్ వద్ద లాబీయింగ్ చేశారు.
అయితే వైఎస్ వివేకా ఉదంతమో… మరో కారణమో కానీ ఏపీలో రాజకీయాలు చేయాలంటే షర్మిల భయపడుతున్నారు. తాను ఏపీలో రాజకీయాలు చేయబోనని అంటున్నారు. ఏమీ లేకపోయినా… పట్టించుకోకపోయినా తెలంగాణలోనే ఉంటానని అంటున్నారు. అలా అయితే కష్టమని హైకమాండ్ లైట్ తీసుకోవడంతో చివరికి.. షర్మిల వెనక్కి తగ్గారని అంటున్నారు. తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేస్తానని.. కాంగ్రెస్ కు ఏపీలో కూడా ప్రచారం చేస్తానని ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ మాత్రం మెత్తబడితే.. షర్మిలను ఏపీకే ఎలా పరిమితం చేయాలో కాంగ్రెస్ కు తెలుసు కాబట్టి విలీనానికి అంగీకరించినట్లుగా చెబుతున్నారు.
గత వారం రోజులుగా షర్మిల బెంగళూరులోనే మకాం వేశారని చెబుతున్నారు. చివరికి పన్నెండో తేదీన విలీన ముహుర్తం ఖరారు చేసుకున్నారని అంటున్నారు. తెలంగాణలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ఇంకా లేటుచేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని అంచనాతో.. తొందరపడుతున్నారు. పాలేరులో షర్మిలకు కొన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించరని అంటున్నారు.
మొత్తంగా షర్మిల … తన తండ్రిని చంపించారని సోనియా మీద జగన్ రెడ్డితో కలిసి చేసిన ఆరోపణల్ని మర్చిపోయి మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరబోతున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీని ఆమె పొగిడేకొద్దీ పొగుడుతున్నారు. గతంలో విధేయత వారసత్వం అంటూ కుటుంబం ఇచ్చిన ప్రకటనల్లో విధేయతను బయటకు తీస్తున్నారు. జగన్ రెడ్డికీ ఈ విధేయత ప్రకటన తప్పకపోవచ్చని.. కాలమే అన్నింటికీ సమాధానం ఇస్తుందని కరుడు గట్టిన కాంగ్రెస్ నేతలు జోకులేసుకుంటున్నారు.