కరోనా లాక్ డౌన్ కారణంగా తన పార్టీ కార్యక్రమాలకు ఏ మాత్రం అడ్డంకులు రాకుండా చూసుకుంటున్న వైఎస్ షర్మిల.. అత్యంత కీలకమైన ప్రక్రియ కూడా పూర్తి చేశారు. తన ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్ పేరు మీద పార్టీని రిజిస్ట్రేషన్ చేయించేశారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా షర్మిల పేరును ఫైనల్ చేశారు. వైఎస్ఆర్టీపీగా ఇప్పటికే.. షర్మిల పార్టీని పిలుస్తున్నారు. ఈ మేరకు పార్టీ పేరును ఖరారు చేసి.. వాడుక రాజగోపాల్ ను ఆ పని మీద ఢిల్లీకి పంపారు. కొద్ది రోజుల పాటు ఢిల్లీలో ఉండి.. పార్టీ రిజిస్ట్రేషన్‌ను వాడుక రాజగోపాల్ పూర్తి చేశారు. వైఎస్సార్టీపీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం లభించడంతో మీడియాకు సమాచారం ఇచ్చారు.
వైఎస్ఆర్ అంటే… వైఎస్ రాజశేఖర్ రెడ్డినా లేకపోతే.. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీ అయిన యువజన శ్రామిక రైతు అని అర్థంనా అన్నదానిపై క్లారిటీ లేదు. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతనే దీని గురించి తెలిసే అవకాశం ఉంది. వైఎస్ఆర్ పుట్టిన రోజు అయిన జులై 8న పార్టీ ప్రారంభం అవుతుంది. ఆ రోజున.. ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున సభ నిర్వహించి.. పార్టీని ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నారు. అదే రోజున.. పార్టీ విధి విధానాలు.. జెండా .. రంగు ఇలా అన్నింటినీ బహిరంగపర్చనున్నారు. అయితే కరోనా కారణంగా సభ నిర్వహణ సాధ్యమో.. కాదో స్పష్టత లేదు. కానీ పార్టీ ఏర్పాటు మాత్రం ఆగకూడదని డిసైడ్ అయ్యారు.
అందుకే ముందుగా పార్టీ పేరును లీక్ చేశారు. ఈ నెల 8 నుంచి పార్టీ ఆవిర్భావ సన్నాహక కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పార్టీ ప్రకటన తర్వాత వేగంగా ప్రజల్లోకి వెళ్లాలని షర్మిల నిర్ణయించుకున్నారు. జులై 21 నుంచి పాదయాత్రకి రూట్ మ్యాప్ కూడా ఖరారైంది. కరోనా వేవ్ తగ్గుతున్న సమయంలో పాదయాత్రకు ఎలాంటి అడ్డంకులు రావని చెబుతున్నారు. ఒక వేళ కరోనా తీవ్రత ఉన్నా.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అయినా సరే పాదయాత్ర చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.