వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల అన్నపై కోపంతో తెలంగాణలోపార్టీ పెట్టాలని అనుకున్నప్పుడే… ఇదేదో తేడాగా ఉందే అని చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు పార్టీకి హైప్ తీసుకు వచ్చేందుకు… ఆ పార్టీ వ్యూహకర్తలు చేస్తున్న తప్పటడుగులు… షర్మిల చేత చేయిస్తున్న ప్రకటనలు… ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. సోషల్ మీడియాలో కామెడీ చేస్తున్నారు. ఇంత ఎలివేషన్ అవసరమా అన్న కామెంట్స్ ఎక్కువగా పడుతున్నాయి. దీనికి కారణం …కాస్త “అతి”గా రాజకీయవ్యూహాలు అమలు చేయడమే.
కొద్ది రోజుల కిందట.. షర్మిల యూనివర్శిటీల విద్యార్థులతో భేటీ అయ్యారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారో కానీ.. ఓ రెండు వందల మంది వరకూ వచ్చారు. ఆ విద్యార్థుల్లో ఒక వ్యక్తి.. తనకు తండ్రి లేడని..అన్నీ షర్మిల అక్కేనని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అక్క రావాలి.. అక్క కావాలి అని.. భావోద్వేగంగా స్పందించాడు.దానికి షర్మిల కూడా… ఆనందభాష్పాలతో స్పందించారు. “నేను నిలబడతా.. మిమ్మల్ని నిలబెడతా” అని డ్రమెటిక్‌గా ప్రకటన చేశారు. ఈ సీన్ సోషల్ మీడియాలో హైలెట్ అయిపోయింది. పెయిడ్ ఆర్టిస్టులతో షర్మిల రాజకీయం చేస్తున్నారని ట్రోలింగ్స్ ప్రారంభమయ్యాయి. అక్క రావాలి అని ఏడ్చిన వ్యక్తి విద్యార్థి కాదు… కల్వరి చర్చిలో వేషాలు వేస్తూ… డ్రమ్స్ వాయించే వ్యక్తి. ఆ తర్వాత కూడా షర్మిల చేత చేయిస్తున్న ప్రకటనలు అన్నీ.. వివాదాస్పదమవుతున్నాయి.
షర్మిల పార్టీలోకి ఆ ప్రముఖ నేత..ఈ ప్రముఖ నేత రాబోతున్నారని ప్రచారం చేయించుకుటున్నారు. మీడియాకు లీకులిస్తున్నారు. కానీ లోటస్ పాండ్ వైపు… గతంలో వైసీపీలో పని చేసి.. ఇప్పుడు ఏ పార్టీలోనూ చోటు లేక రాజకీయంగా ఖాళీగా ఉన్న వాళ్లు మాత్రమే వచ్చి పోతున్నారు. ఓ రకంగా తెలంగాణలో మిగిలి ఉన్న వైసీపీ నేతలు మాత్రమే వస్తున్నారు. అయినప్పటికీ.. లక్షల మందితో సభలు అంటూ మీడియాతో ప్రచారం చేయించుకునేందుకు షర్మిల పార్టీ వర్గాలు చాలా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఖమ్మంలో ఏప్రిల్ 9న లక్షల మందితో సభ పెట్టి పార్టీని ప్రకటిస్తామని.. జూలై 8న ఐదు లక్షల మందితో సభ పెట్టి విధివిధానాలు ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. ఐదు లక్షల మందితో సభ ఎక్కడ పెడతారంటే.. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అంట. ఆ స్టేడియం కెపాసిటీ 30వేలు. గ్రౌండ్లో ఓ ఐదు వేలు పడతారేమో. మరి ఐదు లక్షల మందితో గ్రాఫిక్స్‌తో నిర్వహిస్తారా అన్న ట్రోలింగ్స్ ప్రారంభమయ్యాయి.
వైసీపీ రాజకీయాలు ఎలా చేస్తుందో అచ్చంగా అదే ఫార్ములాను షర్మిల అమలు చేస్తున్నారు. అయితే ఏపీలో వైసీపీ నేతలు.. సాక్షి మీడియా సాయంతో ప్రజల్ని నమ్మించగలిగారు. తెలంగాణలో షర్మిలకు అలాంటి మీడియా సపోర్ట్ లేదు. ఈ కారణంగా ఆమె డ్రామా రాజకీయాలు చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది.