వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర ఆపేశారు. నిన్న ఎన్నికలకోడ్ వచ్చిన తర్వాత కూడా ఈ రోజు ఎక్కడెక్కడ పాదయాత్ర జరుగుందో కూడా మీడియాకు సమాచారం పంపారు. అయితే ఉదయమే ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల కోడ్ కారణంగా పాదయాత్ర వాయిదా వేస్తున్నానని మళ్లీ కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభిస్తామని ప్రకటించారు. నిరాటంకంగా 400 రోజుల పాటు పాదయాత్ర చేయాలనుకున్న ఆమె 22 రోజులకే మొదటి విరామం ఇవ్వాల్సి వచ్చింది.
చేవెళ్లలో ప్రజా ప్రస్థానం పేరుతో ప్రారంభమైన పాదయాత్రలో ప్రస్తుతం నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చౌడంపల్లికి చేరుకుంది. ఏపీలో జగన్ రాజకీయం చేస్తూండగా తాను తెలంగాణలో రాజన్న రాజ్యం తేవాలన్న లక్ష్యంతో పార్టీ ఏర్పాటు చేశారు. పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఆమె పార్టీలో ఎవరూ సీనియర్లు లేకపోవడం.. పార్టీని ఎవరూ పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. పాదయాత్రలో ఎవరూ పాల్గొనడం లేదని.. అరువు తెచ్చుకుంటున్న వారు మాత్రమే నడుస్తున్నారని రిపోర్టులు వస్తున్నాయి.
ఈ కారణంగానే షర్మిల కూడా పాదయాత్రపై ఆసక్తి కోల్పోయారని చెబుతున్నారు. ప్రస్తుతం పాదయాత్ర వాయిదా వేయడంతో మళ్లీ ఎప్పట్నుంచి ప్రారంభిస్తారో క్లారిటీ లేదు. డిసెంబర్ పదిహేనో తేదీ తర్వాత ఎన్నికల కోడ్ ముగిసిపోతుంది కాబట్టి ఆ తర్వాత కొత్త వ్యూహంతో పాదయాత్రను ప్రారంభించే అవకాశం ఉంది.