తెలంగాణలో పార్టీ పెట్టి రాజన్న రాజ్యం తేవాలనుకుంటున్న షర్మిల… పార్టీ ఏర్పాటు ప్రకటన కోసం మంచి ముహూర్తం చూసుకుంటున్నారు. అదేమీ దగ్గరలో లేదని అనిపిస్తూండటంతో పార్టీ నిర్మాణాన్ని ప్రారంభించేశారు. జిల్లాల వారీగా ఆత్మీయ సమావేశాలు పెట్టి.. క్యాడర్ను రెడీ చేసుకుంటున్న షర్మిల ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. మండల స్థాయిలో పార్టీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. మండలానికి ముగ్గురు సభ్యుల చొప్పున కమిటీలు నియమించాలని… వీటిని పదహారో తేదీ లోపు పూర్తి చేయాలని నిర్దేశించారు.
ముఖ్య అనుచరుడు పిట్టారాంరెడ్డికి బాధ్యతలు ఇచ్చారు. మొదట్నుంచి వైఎస్ అభిమానులుగా ఉన్న వారితో కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీలోకి ఇతర పార్టీల నేతల్ని ఆకర్షించేందుకు ప్రత్యేకంగా ఓ టీమ్ పని చేస్తోంది. కాంగ్రెస్లో పెద్దగా గుర్తింపు పొందని నేతలకు.. నేరుగా ఫోన్లు చేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. కొంత మంది నేతలకు నేరుగా వైఎస్ విజయలక్ష్మి ఫోన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ నేతలనే ఆకర్షిస్తున్నారు. షర్మిల ఏప్రిల్ 9వ తేదీన పార్టీని ప్రకటించబోతున్నారు.
పార్టీ పేరు వైఎస్ఆర్ టీపీగా దాదాపుగా నిర్ణయించారు. ఏపీలో వైసీపీకి ఉన్నట్లుగా మూడు రంగుల జెండాను సిద్ధం చేశారు. పార్టీ పేరు వైఎస్ఆర్ అంటే… వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదు.. యువజన శ్రామిక రైతు నే అని ష్రమిల పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి షర్మిల పార్టీ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోంది. హైప్ కోసం.. ఇప్పటికే.. రోజూ.. లోటస్ పాండ్ వద్ద హడావుడి ఉండేలా చూసుకుంటున్నారు.