వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తొలి సంతకాలపై హామీలు ఇచ్చేస్తున్నారు. పాదయాత్ర పాలేరులో అడుగు పెట్టిన వెంటనే.. తన నియోజకవర్గం పాలేరు అని ప్రకటించారు. అక్కడ్నుంచే పోటీ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇప్పటికే పాలేరు నుంచి పోటీ చేయబోతున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు పాలేరు కార్యకర్తల భేటీలో అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో మీడియాతో మాట్లాడిన ఆమె అధికారంలోకి వచ్చాక తొలి సంతకాల గురించి కూడా హామీలు ఇచ్చారు. సీఎం కాగానే తొలి సంతకం ఉద్యోగాల కల్పన మీదే పెడతామని చెప్పుకొచ్చారు.
కేసీఆర్ ఉద్యోగాల పేరుతో మభ్య పెడుతున్నారని తాను వచ్చాక అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తానని అంటున్నారు. షర్మిల పాదయాత్ర ఖమ్మం జిల్లాలోకి వచ్చాక కాస్త ఊపు వచ్చింది. కాస్త జన సమీకరణ చేయగలుగుతున్నారు. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో పెద్దగా ఆదరణ కనిపించలేదు. దీంతో ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఖమ్మం జిల్లాకు వచ్చే సరికి కాస్త జన సమీకరణ చేయడం సానుకూలం కావడం అదే సమయంలో పాలేరు నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో … వైఎస్ పై అభిమానం ఉన్న వారు కదలి వస్తున్నారు.
అయితే ఖమ్మంలో షర్మిల పర్యటనలకు వస్తున్న వారు ఎక్కువగా కడప నుంచి వచ్చినవారే ఉంటున్నారన్న విమర్శలు కూడా ఇతర పార్టీల నేతలు చేస్తున్నారు. తెలంగాణలో ఉన్న నియోజకవర్గాల్లో పాలేరు తప్ప.. ఏ నియోజకవర్గమూ సేఫ్ కాదన్న అంచనాలతో ఉన్న షర్మిల అక్కడ పార్టీకి మంచి ఆదరణ ఉందన్న భావన కల్పించడానికి.. భారీగా జన సమీకరణకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి షర్మిల ఖమ్మం చేరుకునేసరికి కాస్త జనాల్ని చూడగలిగారు. అక్కడ్నుంచి వరంగల్ వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమే.