షర్మిల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అయింది. కాంగ్రెస్ పార్టీలో వరుస చేరికలు జరుగుతున్నాయి. కానీ పార్టీని విలీనం చేయాలనుకుంటున్న షర్మిలకు మాత్రం కబురు రావడం లేదు. అసలు ఏమీ చెప్పడం లేదు. భరోసా ఇచ్చిన డీకే శివకుమార్ వల్ల కూడా కావడం లేదు. ఆమెను చేర్చుకుని… కేసీఆర్ కు మేలు చేయవద్దని నేరుగానే పార్టీ నేతలు హైకమాండ్ కు చెబుతున్నారు. చేరికలు ఏమైనా ఉంటే తెలంగాణ ఎన్నికల తర్వాత చేర్చుకోవాలని… ఏపీకి మాత్రమే పరిమితం చేయాలని అంటున్నారు.
కానీ షర్మిల మాత్రం ఏదో టార్గెట్ పెట్టుకున్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్ లోనే చేరుతానని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కు ఆమె పెద్ద భారం అవుతుందని బాగున్న పార్టీలో ఆమె పెద్ద సునామీ అవుతుందని… వద్దే వద్దని రేవంత్ రెడ్డి గట్టిగానే చెబుతున్నారు. దీంతో షర్మిల గురించి హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకోలేదు. షర్మిలను చేర్చుకోవాలా వద్దా అన్నదానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రేపోమాపో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో షర్మిల తొందరపడుతున్నారు. ఏదో ఒకటి చెప్పాలని హైకమాండ్ వెంట పడుతున్నారు.
కాంగ్రెస్ ఏదీ చెప్పే అవకాశం కనిపించడం లేదు. తెలంగాణ ఎన్నికల్లో ఇప్పుడు ఏం చేయాలన్న దానిపై షర్మిల నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. పార్టీలో ఉన్న వారు కూడా వెళ్లిపోతున్నారు. తాను ఇప్పుడు పోటీ చేయడానికి పాలేరులో కనీసం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోలేకపోయారు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తాం కదా ఇంకెందుకు అన్నట్లుగా ఉన్నారు. షర్మిల కాంగ్రెస్ లో విలీనం కాక ముందే… షర్మిల అతిగా ప్రచారం జరిగేలా చేసుకుని… తన రాజకీయ భవిష్యత్‌కు గండం తెచ్చుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.