తెలంగాణలో పార్టీ పెట్టి.. రాజన్న రాజ్యం తేవాలనుకుంటున్న షర్మిలకు.. రాయలసీమ ఎత్తిపోతల, రాజోలిబండ కుడి కాలువ.. కాలుకు అడ్డంపడేలా ఉన్నాయి. ఈ వివాదం షర్మిల ఇంత వరకూ స్పందించకపోవడంతో ఆత్మరక్షణలో పడిపోయారని అనుకున్నారు. అయితే స్పందించాలా వద్దా.. అన్నట్లుగా.. షర్మిల సోషల్ మీడియాలో స్పందించారు. తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను వదులుకోబోమని.. అవసరం అయితే ఎవరితో అయినా పోరాడటానికి సిద్ధమని ప్రకటించారు. ఎవరితో అయినా పోరాటం కాదు.. అక్కడ ఏపీ సర్కార్‌తో పోరాడాల్సి ఉంది. ఆ విషయం షర్మిలకు… ఆమె పార్టీ నేతలకు తెలియనిదేం కాదు. కానీ.. ఆ విషయం మాత్రం చెప్పడానికి షర్మిలకు నోరు రాలేదు.
దీంతో ఇప్పుడే మొహమాటం ప్రారంభమయిందని.. అన్న పై పోరాటం చేస్తానని చెప్పడానికే .. ఆసక్తి లేని షర్మిల.. ఇక రాజకీయంగా తెలంగాణ కోసం కొట్లాడతామంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నిస్తున్నారు. రాయలసీమ ముద్దు బిడ్డ అయిన షర్మిల.. ఇప్పుడు రాయలసీమకు నీటిని తరలించేందుకు చేపడుతున్న ప్రాజెక్టుల్ని అడ్డుకుంటామన్న ప్రకటనను తెలంగాణ వాసులు నమ్మేలా చెప్పలేకపోయారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. కర్ర విరగకుండా.. పాము చావకుండా రాజకీయాలు చేయాలనుకుంటే.. మొదటికే మోసం వస్తుందని నెటిజన్లు షర్మిలకు గుర్తు చేస్తున్నారు.
షర్మిల రాజకీయాలకు చెక్ పెట్టడానికే.. అన్నతో కలిసి కేసీఆర్ ఈ రాజకీయాన్ని తెరపైకి తెచ్చారని.. తండ్రిని విమర్శిస్తున్నా.. అటు వైపు నుంచి స్పందన రాకపోవడానికి అదే కారణమని అంటున్నారు. ఇలాంటి సందర్భంలో షర్మిల.. స్పష్టమైన విధానంతో… ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడితే తప్ప.. తెలంగాణ వాసులు నమ్మరని అంటున్నారు. ఈ ఫీడ్ బ్యాక్ షర్మిలకు తెలుస్తుందా.. తెలిసినా అలాంటి ప్రయత్నం చేస్తుందా.. అన్నది ఆలోచించాల్సిన విషయమే.