వై.యస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవడానికి సన్నాహాలు ప్రారంభిస్తున్నారు అంటూ ఆదివారం నాడు ఒక పత్రికలో ప్రచురితమైన వార్త రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. అయితే తాజాగా షర్మిల ఈ వార్తలపై స్పందించింది. తాను పార్టీ పెట్టినట్లు వస్తున్న వార్తలు ఖండించడమే కాకుండా ఆ వార్త రాసిన పత్రిక పై ఘాటు విమర్శలు చేసింది. పనిలో పనిగా మీడియాకు నీతులు కూడా చెప్పింది. వివరాల్లోకి వెళితే..
షర్మిల సొంత పార్టీపై ఇప్పటికే భిన్న రకాలుగా స్పందించిన రాజకీయ ప్రముఖులు:
తన సొంత అన్న వైయస్ జగన్ తో షర్మిలకు విభేదాలు ఉన్నాయి అన్న వార్తలు వైఎస్ అనుకూల మీడియాతో సహా అనేక మీడియా సంస్థల్లో పలు మార్లు వచ్చాయి. ముఖ్యంగా జగన్ సతీమణి భారతి కి షర్మిలకు పొసగడం లేదనే వార్తలు ఎప్పటినుండో ఉన్నవే. అయితే షర్మిల రాజ్యసభ సీటు ఆశించినప్పటికీ జగన్ పట్టించుకోలేదని అధికారంలోకి వచ్చాక షర్మిలను పూర్తిగా పక్కన పెట్టేశారని, ఈ కారణంగానే షర్మిల అలకబూనారని వార్తలు వచ్చాయి.
మొత్తానికి తన రాజకీయ భవిష్యత్తు గురించి జగన్ పట్టించుకోకపోవడం వల్లే సొంతంగా గా పార్టీ పెడుతుందని వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఈ వార్తల పై ఇప్పటికే పలు రాజకీయ ప్రముఖులు స్పందించారు. విహెచ్ పొన్నాల లక్ష్మయ్య వంటి కాంగ్రెస్ నేతలు షర్మిల పార్టీ ఏర్పాటు చేయడంలో- తప్పు లేదని, అయితే ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వ్యాఖ్యలు చేస్తే,రేవంత్ రెడ్డి వంటి నాయకులు ప్రతి ఒక్కరూ తెలంగాణ ని రాజకీయ ప్రయోగశాల లా మార్చివేస్తున్నారు అంటూ విమర్శించారు.
పార్టీ పెట్టే వార్తలను ఖండిస్తూ షర్మిల ప్రకటన
అయితే ఆదివారం ఉదయం ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ వార్త వస్తే సోమవారం సాయంత్రానికి షర్మిల ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. “ఆదివారం నాడు ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్‌గా వచ్చిన వార్త నా దృష్టికి ఆలస్యంగా వచ్చింది. వైఎస్సార్‌గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి దురుద్దేశంతో రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ పత్రిక అయినా, ఏ చానల్ అయినా ఓ కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయటమే తప్పు. అది నీతిమాలిన చర్య. అటువంటి తప్పుడు రాతలు రాసిన పత్రిక, చానల్ మీద న్యాయపరమైన చర్యలకు వెనకాడబోమని తెలియజేస్తున్నా’ అని వైఎస్ షర్మిల ఈ పత్రికా ప్రకటన లో పేర్కొన్నారు.
పత్రికలకు గురువింద నీతులు :
రామోజీ రావు కుమారుడు దివంగత సుమన్ కు తన తండ్రితో అప్పట్లో కొద్దిపాటి విభేదాలు ఉండేవి. రాజకీయాలకు గాని ప్రజాప్రయోజనాలకు గాని ఎటువంటి సంబంధం లేని ఈ అంశంపై సాక్షి పత్రికలో తాటికాయంత అక్షరాలతో గతంలో బ్యానర్ స్టోరీ వచ్చిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల విషయంలో, మరి కొందరు రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిగత మరియు కుటుంబ విషయాలతో సాక్షిలో పలుమార్లు కథనాలు వచ్చిన సంగతి తెలుగు పాఠకులకు తెలియంది కాదు. అయినప్పటికీ పత్రికలలో కుటుంబ విషయాలు రాయడం నీతిమాలిన చర్య అంటూ తీవ్ర పదజాలంతో షర్మిల విరుచుకుపడడం తెలుగు ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
నిజంగా షర్మిల పార్టీ పెట్టడం లేదా?
షర్మిలకు భారతి కి మధ్య ఉన్న విభేదాలు, షర్మిల రాజకీయ ఆలోచనల గురించి వైయస్ అనుకూల సోషల్ మీడియాలో సైతం పలు సార్లు వార్తలు వచ్చాయి. దీన్నిబట్టి షర్మిలకు రాజకీయ ఆలోచనలు ఉన్నాయన్న విషయం స్పష్టమవుతోంది. ఇప్పుడు కూడా షర్మిల తాను పార్టీ పెడుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండిస్తూ ఎటువంటి వీడియో బైట్ ఇవ్వలేదు. కేవలం పత్రికా ప్రకటన అంటూ సాక్షి లో మాత్రమే వార్త రావడంతో, షర్మిలకు పార్టీ పెట్టే ఆలోచనలు ఉన్నప్పటికీ వైఎస్ఆర్ సీపీ మరియు సాక్షి కలిసి ఆమె చేత ఈ పత్రిక ప్రకటన విడుదల చేయించారేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఏది ఏమైనా, రాజకీయ పార్టీ సొంతంగా పెట్టాలనుకుంటే షర్మిల ఆంధ్రప్రదేశ్‌లో కూడా సొంత పార్టీ పెట్టుకోవచ్చు. అయితే, నిజంగా తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనే చిత్తశుద్ధి తో పార్టీ పెడితే పర్వాలేదు కానీ, తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ ప్రజల అభిమానాన్ని రాజకీయ ప్రయోగశాలలా మార్చడం మాత్రం అభిలషణీయం కాదు.