వైఎస్ వివేకా హత్య కేసు విచారణను ఇతర రాష్ట్రాలకు తరలించడం మంచిదేనని షర్మిల ఢిల్లీలో స్పష్టం చేశారు.తన కుటుంబంలో జరిగిన ఘోరం ఇదని ఆవేదన వ్యక్తం చేశారు. సునీతకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు. తమ చిన్నాన్నను అంత ఘోరంగా ఎవరు హత్య చేశారో.. వాళ్లకి శిక్ష పడాలన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఏపీ పోలీసులు దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నారని వస్తున్న ఆరోపణల విషయంలోనూ.. షర్మిల సూటిగా స్పందించారు. దర్యాప్తును ఎవరు అడ్డుకోవడానికి వీల్లేదని షర్మిల స్పష్టం చేశారు. కాళేశ్వరంలో అవినీతిపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌కు ఫిర్యాదు చేసేందుు మరోసారి ఢిల్లీ వెళ్లిన షర్మిల మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో షర్మిల ఇప్పటికే సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలు ఈ విషయాన్ని చెబుతున్నారు. కానీ షర్మిల మాత్రం .. వివేకా హత్య కేసు విషయంలో వాంగ్మూలం ఇచ్చారో లేదో స్పష్టత ఇవ్వలేదు. సోదరుడు జగన్‌తో విభేదాలున్నాయని ప్రచారం జరుగుతున్న సమయంలో .. వైఎస్ వివేకా హత్య కేసు విచారణను ఇతర రాష్ట్రాలకు తరలించడాన్ని సమర్థించడం.. గతంలో ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి ఆపేరు తీసేస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించడాన్నీ వ్యతిరేకించారు. దీంతో జగన్‌కు భిన్నమైన ధోరణిలో షర్మిల రాజకీయాలు చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
అయితే తెలంగాణ రాజకీయాల్లో సీరియస్‌గా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న షర్మిల.. కాళేశ్వరం కాంట్రాక్టర్ అయిన మేఘా కృష్ణారెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. కేసీఆర్‌తో కుమ్మక్కు అయి వేల కోట్లు దోచుకున్నారని అంటున్నారు. ఈ క్రమంలో మేఘా , కేసీఆర్ బంధం టార్గెట్ గానే.. ఢిల్లీలో ఫిర్యాదులు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆమె ఢిల్లీలో సీబీఐ డైరక్టర్, కాగ్ వంటి పెద్దల అపాయింట్మెంట్లు కూడా సులువుగా లభిస్తున్నాయని.. బీజేపీ నేతలు షర్మిలకు సహకరిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.