రుషికొండ…ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ట్రెండింగ్ టాపిక్. ఈ వ్యవహారం వైసీపీ అధినేత జగన్ ను అప్రతిష్టపాలు చేస్తోంది. వందల కోట్ల ప్రజా ధనం ఖర్చు చేసి విశాఖలో తనకోసం విలాసవంతమైన భవనాలు నిర్మించుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. రుషికొండలో భవనాలు రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్.. ఎవరు వచ్చినా ఉండేలా నిర్మాణాలు చేశామన్నాని వైసీపీ నేతలు చెబుతున్నా.. జగన్ మనస్తత్వం తెలిసిన వారంతా ఈ నిర్మాణాలు ఆయన కోసమేనని బలంగా వాదిస్తున్నారు. ఈ విషయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది.
ఈ క్రమంలోనే ఈ రుషికొండ వ్యవహారంపై కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల స్పందించారు. రుషికొండలో భవన నిర్మాణాలతో ప్రజా ధనం దుర్వినియోగం జరిగిందన్న షర్మిల.. ఇలాంటి వాటిని అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కీలక వ్యాఖ్యలు చేశారు షర్మిల. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత షర్మిల ఏపీ రాజకీయాలపై పెద్దగా రియాక్ట్ అయింది లేదు. తాజాగా రుషికొండ వ్యవహారం ఏపీలో తీవ్ర దుమారం రేపుతుండటంతో ఈ అంశంపై స్పందించిన ఆమె…అన్నయ్య జగన్ నిర్వాకంపై ఏకంగా సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ చేశారు.
ఇటీవలే ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమైన షర్మిల.. ఏపీలో పార్టీ బలోపేతం చేయాలంటూ సూచించారు. వైసీపీ బలగమంతా పూర్వాశ్రమం కాంగ్రెస్ లో పని చేసిన వారే. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో నేతలు, కార్యకర్తలు నైరాశ్యంలో ఉన్నారు. జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో ఆ పాత్రను పోషించేందుకు షర్మిల చకచక అడుగులు వేయలనుకుంటున్నారు. తద్వారా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా, మాజీలను సొంత గూటికి ఆకర్షించే వ్యూహంతోనే షర్మిల ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.