వైఎస్ వివేకా హత్య ఆస్తుల కోసమే జరిగిందంటూ కథలు అల్లుతున్న జగన్ రెడ్డి క్యాంప్‌కు సోదరి షర్మిల ఘాటైన రిప్లయి ఇచ్చింది. అసలు ఆస్తుల అంశమే ఆ కుటుంబంలో లేదని స్పష్టం చేసింది. వైఎస్ వివేకాకు ఉన్న ఆస్తులన్నీ ఎప్పుడో సునీతకు రాసేశారని.. ఆయన పేరుపై ఎలాంటి ఆస్తులు లేవని షర్మిల స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె వైఎస్ వివేకా హత్య విషయంలో జగన్ రెడ్డి క్యాంప్ చేస్తున్న ఆరోపణలపై నేరుగానే స్పందించారు.
వివేకా పేరుపై లేని ఆస్తుల కోసం ఎవరు హత్య చేస్తారని.. సునీత భర్త ఆస్తుల కోసం చంపాలనుకుంటే.. ఆస్తులన్నీ సునీత పేరుపై ఉన్నాయి కాబట్టి సునీతనే చంపాలన్నారు. అదే సమయంలో వైఎస్ వివేకా వ్యక్తిగత జీవితంపై నిందలు వేస్తూ ఆయనో ఉమనైజర్ అన్నట్లుగా చిత్రీకరిస్తున్న జగన్ రెడ్డి క్యాంప్‌పై షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వ్యక్తిగత జీవితంపై మాట్లాడే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. ఆయన సాధారణ జీవితం గడిపారన్నారు. కొన్ని మీడియా సంస్థలు ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని నీలి కూలీ మీడియాపై మండిపడ్డారు.
చనిపోయిన వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేయడం దారుణమని వీటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని షర్మిల స్పష్టం చేశారు. వివేకానందరెడ్డి ప్రజల మనిషి అని.. ఆయనేంటో కడప జిల్లా ప్రజలకు తెలుసన్నారు. షర్మిల వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవినాష్ రెడ్డి ని కాపాడటానికి చనిపోయిన వివేకాపై అత్యంత దారుణమైన నిందల్ని వేస్తున్నారు. లేనిపోనివి ప్రచారం చేస్తున్నారు. కోర్టుల్లో దాఖలు చేసే అఫిడవిట్లలోనూ ఈ ఆరోపణలు చేస్తున్నారు. అలాగే .. వివేకా హత్యానేరాన్ని రాజశేఖర్ రెడ్డి, సునీతలపై వేయడానికి ఆస్తుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. కానీ అవి కూడా వివేకా పేరు మీద లేవని షర్మిల క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు జగన్ రెడ్డి క్యాంప్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.