పాలేరు నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవడానికి షర్మిల మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. సొంత డబ్బుతో ఉచిత పథకాలు అమలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే పాలేరులో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఫ్రీ స్కీములను అమలు చేయాలని నిర్ణయించారు. మెజార్టీ ఓటర్లకు ఆరోగ్యశ్రీ కార్డు తరహాలోనే గుర్తింపు కార్డులను ఇచ్చి.. ఏ ఆస్పత్రిలో అయినా వారికి ఉచిత వైద్యం చేయించేందుకు రెడీ అవుతున్నారు. ఖమ్మంలోనే కాకుండా అవసరమైన వారికి హైదరాబాద్లో కూడా ఉన్నత స్థాయి వైద్యానికి అయ్యే ఖర్చును పార్టీ భరించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు నాలుగు అంబులెన్సులను రెడీ చేశారు.
అలాగే పేద విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్య చెప్పించాలనుకుంటున్నారు. స్కూళ్లతో ఒప్పందాలు చేసుకుని ఆ ఫీజు తామే చెల్లించాలనుకుంటున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తామని చెబుతున్నారు. అదే సమయంలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఉన్నత విద్య చదివే స్టూడెంట్స్ఎవరైనా ఆర్థిక సాయం కోరితే అందించేందుకు ప్రత్యేక ఆఫీస్ పెడుతున్నారు. నిజంగా పేదరికం కారణంగానే ఉన్నత చదువులకు ఇబ్బందులు పడుతున్నట్టయితే వారికి తక్షణ సాయం అందిస్తామని ప్రచతారం చేస్తున్నారు.
ఇక పాలేరులో ఎవరు చనిపోయిన కుటుంబాలకు రూ.25 వేలు ఇవ్వనున్నారు. నిజానికి ఇప్పటికే ఈ సాయాన్ని పంచడం ప్రారంభించారు. గర్భిణికి రూ.10వేలు, అమ్మాయి పుడితే రూ.25వేల చొప్పున అందిస్తామని.. పేదల ఇండ్లలో పెళ్లిళ్లకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని వైఎస్ఆర్ టీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న వైఎస్ షర్మిల, ఈనెల 19న హైదరాబాద్ తిరిగి రానున్నారు. ఆ తర్వాత పాలేరులో పర్యటించి కొన్ని పథకాల అమలు ప్రారంభిస్తారు. సొంత డబ్బులతో షర్మిల అమలు చేస్తారని, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని నియోజకవర్గాలకు విస్తరిస్తామని ప్రచారం చేయబోతున్నారు.