తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టి రాజన్న రాజ్యం తెస్తానంటూ ప్రతీ మంగళవారం దీక్షలు చేస్తున్న వైఎస్ షర్మిలను ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. మొదట్లో ఆంధ్రజ్యోతి వంటి మీడియా భారీ పబ్లిసిటీ ఇవ్వడంతో కాస్త హైప్ వచ్చింది. కానీ రాను రాను ఆమెకు మీడియాలో కవరేజీ కూడా తగ్గిపోతోంది. సోషల్ మీడియాలోనూ ఆమె పార్టీ అంత బలంగా లేదు. అదే సమయంలో నేరుగా మీడియాతో ఇంటరియాక్ట్ అయ్యేందుకు షర్మిల సిద్ధంగా లేరు. ఏదైనా ఆమె పార్టీ ప్రతినిధులు చెప్పిందే సమాచారం. ఇంత వరకూ షర్మిల ప్రత్యేకంగా ఇంటర్యూలు ఇచ్చింది లేదు. ఎంపిక చేసిన కొంత మందితో మాట్లాడారు. అది కూడా స్క్రిప్టెడ్ అన్న విమర్శలు వచ్చాయి.
తెలంగాణ సంప్రదాయక మీడియాలో ఆమెకు చోటు దక్కడం లేదు. అదే సమయంలో ఆమె ప్రతి మంగళవారం చేస్తున్న ఉద్యోగ దీక్షలకు పెద్దగా ప్రజల్లోకి వెళ్లడం లేదు. అన్నీ కార్పొరేట్ ఈవెంట్లల లాగా జరుగుతూండటంతో ఆ పార్టీకి చెందిన నేతలు కూడా ఉద్యోగంలాగా చేసుకుంటున్నారు. ఈ తరహా వాతావరణం నచ్చకే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్టీపీలో చేరిన ప్రముఖ నేతగా చెలామణి అయిన ఇందిరాశోభన్ గుడ్ బై చెప్పారు. నిజానికి షర్మిల పార్టీకి ఎప్పుడూ కవరేజీ ఇవ్వని మీడియాకు కూడా ఇందిరా శోభన్ ఇంటర్యూలు తీసుకుని … అఆ పార్టీలో ఏం లేదని చెప్పడానికి ప్రయత్నించాయి.
ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్‌లో షర్మిల తప్ప చెప్పుకోదగ్గ లీడర్ ఎవరూ లేరు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడే కొండా రాఘవరెడ్డి వంటి వారికి జనంలో పలుకుబడి లేదు. మొదట్లో ఆమె పార్టీకి వచ్చిన హైప్‌ను చూసి వచ్చి చేరిన ఏపూరి సోమన్న లాంటి కళాకారులు కూడా ఇప్పుడు వేరే దారి చూసుకునేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం ఉంది. మొత్తానికి షర్మిల రాజకీయ పార్టీ విషయంలో బాలారిష్టాలను ఎదుర్కొంటున్నారు. వాటినే అధిగమింటడానికి తంటాలు పడుతున్నారు. క్రమంగా తెలంగాణలో వైఎస్ఆర్టీపీని పట్టించుకోవడం మానేసే పరిస్థితి కనిపిస్తోంది.