సాక్షికి తాను సహ యజమానిని అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో షర్మిల ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు రావడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన వైఎస్ షర్మిలకు మీడియా సపోర్ట్ లేదన్న అభిప్రాయం ఉంది. ఆమె కుటుంబానికి చెందిన సాక్షి మీడియా సరిగ్గా ప్రచారం ఇవ్వడం లేదన్న అభిప్రాయం ఉంది. అయితే ఇటీవలి కాలంలో ఆమె తెలంగాణలో సాక్షి మీడియాను టేకోవర్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని ఇంటర్యూలో జర్నలిస్ట్ షర్మిలను ప్రశ్నించారు. ఆ సందర్భంలోనే తాను సాక్షికి కో ఓనర్నని స్పష్టం చేశారు. అంటే ఇక నుంచి తెలంగాణలో సాక్షి ఇక షర్మిల ఆధ్వర్వంలో నడిచే అవకాశం ఉంది. సాక్షి మీడియా గ్రూప్‌లో షర్మిలకు అధికారికంగా వాటాలు ఉన్నట్లుగా ఎక్కడా లేదు. అయితే సోదరుడు జగన్మోహన్ రెడ్డితో ఆస్తులు పంచుకోవాల్సిన పరిస్థితి వస్తే అన్నింటిలోనూ సగం వస్తుంది కాబట్టి సాక్షి మీడియాలోనూ ఆమెకు సగం హక్కు ఉంది కాబట్టి అలా మాట్లాడి ఉంటారని అంచనా వేస్తున్నారు. కో ఓనర్ అని ఆ ఉద్దేశంతోనే అని ఉంటారని అంచనా వేస్తున్నారు.
ఈ ఇంటర్యూలోనే షర్మిల అనేక అంశాలపై తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ప్రశాంత్ కిషోర్ తన పార్టీకి ఇంత వరకూ ఎలాంటి సేవలు అందించలేదని అయితే ఇక ముందు ఖచ్చితంగా ఆయన సాయం ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రశాంత్ కిషోర్ సోదరుడని.. తాను సాయం చేస్తానని గతంలో చెప్పినట్లుగా షర్మిల చెప్పుకొచ్చారు. తెలంగాణలో తనకు బలం .. బలగం లేదనుకోవడం లేదని.. తన బలం వైఎస్ఆర్ అని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ అభిమానులు.. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాల లబ్దిదారులు తన బలగం అని తేల్చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉంటూ తెలంగాణలో వైఎస్ఆర్ టీపీకి విజయమ్మ పని చేయడంపైనా షర్మిల భిన్నంగా స్పందించారు. అలా ఎందుకు పని చేయకూడదని ఎదురు ప్రశ్నించారు. ఆమె వైఎస్ఆర్ భార్య.. తన తల్లి అని చెప్పుకొచ్చారు. పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకోవాలనుకుంటున్నారన్న దానిపైనా స్పందించారు. పాదయాత్ర ద్వారా సీఎం పీఠం రాదని జనం కోసం పోరాడితేనే వస్తుందని చెప్పుకొచ్చారు. ఎక్కడికి వెళ్లినా కన్నీళ్లు పెట్టుకోవడం జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు షర్మిల సూటిగా తన సమాధానం ఇచ్చారు. తనకు ఎమోషనస్ ఎక్కువ అని ఎవరైనా బాధపడితే నేను వారి బాధను చూసి ఏడుస్తానని చెప్పారు. ఎమోషనల్గాఉంటే తప్పు లేదు. తనకు మనసు ఉంది.. అమ్మతనం ఉంది. అందుకే ఏడుపొస్తుంది. ఎమోషన్స్ ఉండటం తప్పు కాదని వివరించారు.
పార్టీ పెట్టిన తర్వాత షర్మిల మీడియా చానళ్లకు నేరుగా ఇంటర్యూలు ఇవ్వలేదు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనదిగా మారి వార్తలు అందించే చానల్‌కు తొలి సారి ఇంటర్యూ ఇచ్చారు.