ఆంధ్రప్రదేశ్లో దోచుకోవడం.. దాచుకోవడం తప్ప ఏమీ లేదని జగన్ పాలనలో ఏపీ అథోగతి పాలయిందని ఏపీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఘాటుగా విమర్శలు గుప్పించారు. విజయవాడలోన ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీ సర్కార్ పై పూర్తి స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఏపీకి ప్రత్యేకహోదా తీసుకు రావడం జగన్కు సాధ్యం కాలేదన్నారు. ఎన్నికలకు ముందు ప్రత్యేకహోదా కోసం జగన్ మూకుమ్మడి రాజీనామా చేస్తామన్నారని.. కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క సారి కూడా ప్రత్యేకహోదాపై ఉద్యమం చేయలేదన్నారు. ప్రత్యేకహోదా రాలేదంటే ఆ పాపం జగన్ దేనని మండిపడ్డారు. సీఎం జగన్ మూడు రాజధానుల పేరుతో ఒక్క రాజధాని లేకండా చేశారని.. ఏపీని రాజధాని లేకుండా చేశారన్నారు. పట్టుమని పది పరిశ్రమలను కూడా తీసుకురావడం చేతకాలేదని ఎద్దేవా చేశారు.
ఏపీ ప్రభుత్వాన్ని పది లక్షల కోట్ల అప్పుల్లో ముంచేశారని.. కనీసం జీవితాలివ్వడానికి, రోడ్లు వేయడానికి కూడా డబ్బులు లేవన్నారు. రాజధాని కట్టడానికి క నిధులు ఎక్కడ నుంచి వస్తాయన్నారు. ఏపీలో మైనింగ్ , ఇసుక మాఫియా రెచ్చిపోతోందని… దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు. అయితే షర్మిల జగన్ రెడ్డితో పాటు టీడీపీ పాలనను కూడా విమర్శించారు. పదేళ్లలో టీడీపీ, వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందలేదన్నారు. చంద్రబాబు రెండు లక్షల కోట్ల అప్పు చేస్తే.. జగన్ రెడ్డి ఆరున్నర లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు.
షర్మిల జగన్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేయడంతో ఆమె ఎలాంటి మొహమాటాలు పెట్టుకోకుండా రాజకీయాలు చేస్తారని తేలిపోయింది. ఆమె జగన్ ను విమర్శించడంలో వెనుకడుగు వేసినట్లయితే…. ఆమె రాజకీయ జీవితం అంత సాఫీగా సాగదని అనుకున్నారు. కానీ షర్మిల మాత్రం అన్నీ అంచనాలను తలకిందులు చేశారు. జగన్ రెడ్డిపై విమర్శలు గుప్పించడం వల్ల.. ఆపార్టీ నుంచి రావాలనుకునేవారికి.. తాము ఒకటి కాదన్న సందేశం పంపారు.