షర్మిలను వైసీపీ నేతలు టార్గెట్ చేసుకున్నారు. వ్యక్తిగతంగా కూడా తిట్లందుకుంటున్నారు. జగన్ రెడ్డి సొంత చెల్లెలినీ సోషల్ మీడియాలో వేధించేందుకు వెనుకాడటం లేదు. ఆయనకు తెలియకుండా ఇది జరగదు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే.. షర్మిల తమ ఓటు బ్యాంక్ ను చీల్చడానికి ప్రయత్నిస్తోందని అభిప్రాయానికి రావడమే.
బలం నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో షర్మిల
షర్మిల తెలంగాణలో విఫల నేత. ఏపీలో అయినా బలం నిరూపించుకోకపోతే ఆమెకు ఇక విలువ ఉండదు. అందుకేజరగబోయే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు గెలవకపోయినా ఓటు షేర్ తీసుకు రావాలి. కాంగ్రెస్ పార్టీ జీరో కాబట్టి.. ఎంత ఓటు షేర్ తెచ్చుకుంటే ఆమెకు అంత బలం ఉన్నట్లు. అందుకోసం షర్మిల సంప్రదాయ ఓటు బ్యాంక్ నే నమ్ముకుంటుున్నారు. కాంగ్రెస్ పార్టీని ఆదరించే ముస్లిం, దళిత వర్గాలను ఆకట్టుకునేందుకు షర్మిల మొదటి స్పీచ్ లోనే ప్రయత్నాలు చేశారు.
దళిత , ముస్లిం ఓటర్లకు గాలం
కాంగ్రెస్కు ఓటు బ్యాంక్ పెంచడానికి దగ్గర దారి ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు. సీఎం జగన్ సొంత పార్టీ పెట్టుకునే వరకూ ఏపీలో ముస్లిం, దళిత వర్గాలన్నీ కాంగ్రెస్ ను అంటి పెట్టుకుని ఉన్నాయి. కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె ఈ రెండు వర్గాలకు కాంగ్రెస్ మాత్రమే రక్ష అన్నట్లుగా మాట్లాడుతున్నారు. సీఎం జగన్ స్వయంగా క్రైస్తవుడు అయినప్పటికీ ఆయన మణిపూర్ లో చర్చిలపై జరిగిన దాడుల్ని ఖండించలేదని విమర్శించి సంచలనం రేపారు. అంతే కాదు.. మైనార్టీ వర్గాలను ఆకట్టుకునేందుకు బీజేపీ కి టీడీపీ, వైసీపీ రెండు భయపడుతున్నాయని.. ఆ పార్టీకి తొత్తులేనని విమర్శలు చేశారు.
బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ మాత్రమే !
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. బీజేపీని వ్యతిరేకించే క్రిస్టియన్, ముస్లిం వర్గాలకు మరో చాయిస్ లేదు. ఎందుకంటే అన్ని పార్టీలు బీజేపీతో సన్నిహితంగా ఉంటాయి. అ వర్గాల్లో అసంతృప్తి ఉందని షర్మిల గుర్తించారు. ఈ కారణంగానే అందర్నీ టార్గెట్ చేయడమే కాకుండా.. తమ విధానాలను స్పష్టంగా చెప్పి వారిని మళ్లీ తమ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా భావిస్తున్నారు.
అందుకే షర్మిలపై వైసీపీ ఎదురుదాడి
షర్మిల రాజకీయం ఇంత సూటిగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు మొదట ఊహించలేదు. కానీ ఆమె బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎదురుదాడి చేయడంతో ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. వెంటనే వైసీపీ నేతలు కౌంటర్లు ఇవ్వకపోతే తమ ఓటు బ్యాంకుకే ఎక్కువ నష్టం జరుగుతుందన్న అంచనాలతో రంగంలోకి దిగిపోయారు. రెండు, మూడు శాతం ఓట్లు చీలినా వైసీపీకి తీవ్ర నష్టం జరుగుతుందన్న అభిప్రాయం ఉంది. షర్మిలను తిడితే ఆ ఓట్లు చీలకుండా ఉంటాయా లేకపోతే ఇంకేమైనా చేయాలా అన్నది వైసీపీ ఆలోచించుకోవాల్సి ఉంది.