వైసీపీకి చావో, రేవో అన్నట్లుగా తయారైన ఈ ఎన్నికల్లో షర్మిలను చూసి జగన్ రెడ్డి భయపడుతున్నారా..? షర్మిల పోటీ చేస్తోన్న కడప లోక్ సభ మాత్రమే కాదు..పలు నియోజకవర్గాల్లో ఆమె ప్రభావం ఉంటుందని టెన్షన్ పడుతున్నారా..? షర్మిల రూపంలో కాంగ్రెస్ ఓట్ల చీలికతో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందా..? అంటే అవుననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు.
ఏపీలో కాంగ్రెస్ పోటీతో అధికార వైసీపీ వణుకుతోంది. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ నామమాత్రపు పోటీలో ఉండటంతో కాంగ్రెస్ శ్రేణులు కూడా వైసీపీని ఆదరించడం జగన్ రెడ్డికి లాభించింది. ఇటీవల షర్మిల ఏపీ పీసీసీ బాధ్యతలు చేపట్టడంతో కాంగ్రెస్ లో కొంత ఊపు కనిపిస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పునాదులపై వైసీపీ నిలబడింది. దానికి వైఎస్ ఛరిష్మ తోడైంది. ఇప్పుడు అదే వైఎస్ కార్డుతో, అదే కాంగ్రెస్ పార్టీ నుండి జగన్ సొంత చెల్లి బరిలోకి దిగటంతో కొంతైనా ఓటు బ్యాంకు పోతుందని వైసీపీలో భయం మొదలైంది. ఇప్పటికే జనసేన- బీజేపీ – టీడీపీ కూటమిగా ఏర్పడటంతో టెన్షన్ పడుతోన్న వైసీపీ, బూత్ మేనేజ్మెంట్ పై ఫోకస్ చేసింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలిస్తే వైసీపీకి ఓటమి తప్పకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చాలా సీట్లలో కొంతైనా ఓట్లు చీల్చే అవకాశం ఉంది. రెండు, మూడు వేల ఓట్లు చీల్చినా మొత్తం ఫలితమే మారిపోయే ప్రమాదం ఉంది. నెక్ టు నెక్ పోటీ ఉన్న చాలా చోట్ల ఈ ఓట్లు చాలా ముఖ్యం. కాంగ్రెస్ చీల్చే ఓట్లన్నీ వైసీపీవే అని కూటమి బలంగా నమ్ముతండగా, జగన్ వదిలిన షర్మిల బాణం ఇప్పుడు తనకే తగిలినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు విశ్లేషకులు.