కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు, జగన్ రెడ్డి సోదరి షర్మిల జనంలోకి వెళ్తున్నారు. సిక్కోలు నుంచి కడప వరకూ నెలాఖరు వరకూ పర్యటన చేయబోతున్నారు. షర్మిల ఇప్పటి వరకూ ఏపీ లో ఎప్పుడు ప్రచారం చేసినా మా అన్న జగన్ రెడ్డికి ఓటేయండి అని అడిగేవారు. తల్లి, చెల్లి ఇద్దరూ కలిసి జగన్ కోసం ఉరూవాడా తిరిగేవారు. సెంటిమెంట్ పండించేవారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. జగన్ రెడ్డికి వ్యతిరేకంగా షర్మిల ప్రచారం ప్రారంభించారు.
కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత నేరుగా జగన్ రెడ్డిని టార్గెట్ చేయడంతో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. ఆమె వ్యతిరేక ప్రచారం కన్నా.. ఎక్కువగా చెల్లిని జగన్ రెడ్డి ఎంత మోసం చేస్తే ఇలా రివర్స్ లో కాంగ్రెస్ లో చేరి రివెంజ్ తీర్చుకోవడానికి వస్తున్నారన్న చర్చ ప్రజల్లో జరుగుతోంది. రాబోయే రోజుల్లో తన కుమార్తెకు మద్దతుగా తల్లి కూడా కనిపిస్తే జగన్ రెడ్డి నైతికంగా పాతాళానికి పడిపోయినట్లే. తల్లి, చెల్లి మద్దతును కూడా పోగొట్టుకున్న ఆయన ఇక జనాల అభిమానాన్ని ఎలా కాపాడుకుంటారు ?
తల్లి, చెల్లినే తమను జగన్ రెడ్డి మోసం చేశారని ఫీలవుతూంటే.. ఇక ఏపీ ప్రజలు ఏమనుకోవాలి. చెప్పిన వాటికి.. చేసిన వాటికి పొంతన లేదు. అప్పులు పుట్టినన్ని రోజులు బటన్లు నొక్కారు. ఇప్పుడు బటన్లు నొక్కుతున్నా డబ్బులు రాలడం లేదు. అందరూ షర్మిల లాగే ఫీలవుతున్నారు. వారికి త్వరలోనే రివెంజ్ తీర్చుకునే అవకాశం రాబోతోంది.