కడప ఎంపీ బరి ఈ సారి ప్రత్యేకంగా మారనుంది. అవినాష్ రెడ్డిపై షర్మిల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. సునీత లేదా ఆమె తల్లి ఇండిపెండెంట్ గా లేదా టీడీపీ తరపున పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ వారి తరపున తానే పోరాటం చేస్తానని.. న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని షర్మిల ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో ఆమె .. కడప ఎన్నికల బ రిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ తదుపరి జాబితాలో ప్రకటన చేసే అవకాశం ఉంది.
కడప బరిలో షర్మిల ఉంటే… ఆసక్తికర పోరు జరగడం ఖాయం అనుకోవచ్చు. వైఎస్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి మళ్లీ అవినాష్ రెడ్డికే టిక్కెట్ ఇచ్చారు. వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్ పై ఉన్నప్పటికీ.. ఆయనను మార్చే సాహసం జగన్ చేయలేదు. అదే సమయంలో ప్రజల్లో ఆయనపై తీవ్ర ఆగ్రహం ఉంది. బంధువర్గంలోనూ ఆయనకు ఇరవై శాతం సపోర్ట్ కూడా లేదు. ఎనభై శాతం మంది షర్మిలకే మద్దతుగా ఉంటున్నారు. ప్రజలు కూడా అలాగే చీలిపోయే అవకాశం ఉంది. ప్రచార సరళి పూర్తిగా వివేకా హత్య కేసు గురించి సాగితే… అవినాష్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైనా ఆశ్చర్యం ఉండదన్న వాదన వినిపిస్తోంది.
ఇక పులివెందుల నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. సునీత లేదా ఆమె తల్లిని అసెంబ్లీకి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న చర్చ నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. ముందు ముందు ఈ అంశంపై కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కడపలో ఈ సారి కుటుంబ పోరాటం హైలెట్ కానుంది.