ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ప్రత్యేకహోదా అస్త్రంలో ప్రధానంగా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలో ధర్నాకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రెండో తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్లో ప్రత్యేకహోదాపై ధర్నా చేయనున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతల్ని ఢిల్లీకి రావాలని ఆదేశించారు కొంత మంది ఏఐసీసీ నేతలు కూడా ధర్నాలో పాల్గొనే అవకాశం ఉంది.
వైసీపీని గెలిపిస్తే ప్రత్యేకహోదా తీసుకొస్తానని.. కేంద్రంలో ఎల్లయ్య ఉన్నా పుల్లయ్య ఉన్నా మెడలు వంచుతానని జగన్ రెడ్డి ప్రగల్భాలు పోయారు. తీరా గెలిచిన తర్వాత బీజేపీకి లొంగిపోయారు. ప్రత్యేకహోదాను అడిగిన పాపాన పోలేదు. కానీ తన రాజకీయ అవసరాలు.. కేసుల విషయంలో మాత్రం చాలా వరకూ ప్రయోజనాలు పొందారు. తన వరకూ ప్రత్యేకహోదా సాధించుకున్నారు. ఇప్పుడు ప్రత్యేకహోదా అంశాన్ని షర్మిల అందుకుంటున్నారు. జగన్ రెడ్డి ప్రజల్ని మోసం చేశారని ఆరోపిస్తూ.. ఆమె కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో దీక్ష నిర్వహించడం ద్వారా.. మరోసారి ప్రత్యేకహోదా అంశాన్ని హైలెట్ చేస్తున్నారు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదాను ఇస్తామని రాహుల్ గాంధీ చెబుతున్నారు. గతంలోనూ ఆదే ప్రధాన హామీగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి పెద్దగా బలం లేకపోవడంతో ఆ హామీకి విలువ లభించలేదు. కానీ ఇప్పుడు షర్మిల లాంటి నాయకత్వం రావడంతో.. హోదా అంశంపై చర్చ జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. షర్మిల కూడా ఇదే అంశాన్ని హైలెట్ చేయాలనుకుంటున్నారు. ప్రధాని మోదీకి కూడా లేఖ రాశారు. హోదా అంశంపబై చర్చ జరిగితే కాంగ్రెస్ పార్టీకి మరింత మేలు జరిగే అవకాశం ఉంది.