తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి.. రాజన్న రాజ్యం తీసుకు వచ్చి.. అందరికీ న్యాయం చేసేయాలన్న పట్టుదలతో ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా ఉపయోగించుకున్నారు. పెద్ద ఎత్తున మహిళల్ని లోటస్ పాండ్‌కు వచ్చేలా చేసుకుని మహిళా దినోత్సవాన్ని జరిపారు. అందరితో సెల్ఫీలు దిగారు. అదే సమయంలో గంభీరమైన ప్రకటనలు చేశారు. ఇందులో టీఆర్ఎస్ సర్కార్.. కేసీఆర్ తీరుపై విమర్శలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో మహిళలది కీలక పాత్ర అయినప్పటికీ.. తెలంగాణ సమాజంలో స్త్రీల ప్రాతినిధ్యం ఎంత ఉందని.. సాధించుకున్న రాష్ట్రం లో అసమానతలు పెరిగాయని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎంతో మంది మహిళలు మంత్రి పదవులు అందగా.. ప్రత్యేక రాష్ట్రం లో 5 యేళ్ళ తర్వాత అదీ కూడా ఇద్దరికి మాత్రమే మంత్రి పదవులు వచ్చాయన్నారు. జనంలో సగం మనం అయినప్పుడు ఇలాంటి అసమానతలు ఎలానో పాలకులు సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. చట్ట సభలు దగ్గర నుంచి ఉద్యోగాల వరకు… మహిళలకు నిర్దిష్ట కోటా ఉండాల్సిందేనని… తమ పార్టీలో ఆ మేరకు ప్రాతినిధ్యం ఉంటుందని మీ చెల్లిగా, అక్కగా మాట ఇస్తున్నానని డ్రమటిక్‌గా ముగింపునిచ్చారు.
అయితే చాలా మందికి ఇక్కడే డౌట్ వచ్చింది. సొంత కుటుంబంలో తనకు న్యాయంగా దక్కాల్సిన హక్కులను రక్షించుకోలేక… ఆస్తులు, పదవులు పొందలేక.. తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టిన షర్మిల.. మహిళల హక్కులను ఎలా కాపాడతారన్నదే ఆ డౌట్. ఈ పాయింట్ వాలిడే. అయితే రాజకీయాల్లో .. షర్మిల వచ్చారు.. అండగా నిలబడతారన్నదే చేయాల్సిన ప్రచారం.. ఇలాండి డౌట్స్ వ్యక్తం చేయకూడదు. మరదే రాజకీయం.