తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి… దానికి తగ్గట్లుగా కార్యకలాపాలను నిర్వహించడానికి… తెలంగాణ అధికార పార్టీ నుంచి ఇతోధిక సహకారం పొందుతున్న షర్మిల… వీలైనంత వరకూ ప్రభుత్వంపైనే విమర్శలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇతర పార్టీల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆమె మరో రకమైన రాజకీయం చేస్తున్నారు. పోలీసుల్ని సవాల్ చేయాలని నిర్ణయించుకున్నారు. నిరుద్యోగ సమస్యపై ఆమె మూడు రోజుల పాటు ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం అక్కడ టెంట్లు ఇతర ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే పోలీసులు మాత్రం వివిధ కారణాలు చెబుతూ.. టెన్ టు ఫైవ్ మాత్రమే ధర్నా చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. అయితే ఈ అనుమతిపై షర్మిల పార్టీ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు.
ముందుగా పోలీసులు అనుమతించిన దానిప్రకారం.. దీక్ష ప్రారంభించి.. ఆ తర్వాత అనుమతి లేకపోయినా.. మరో రెండు రోజుల పాటు దీక్షలు కొనసాగిస్తామని చెబుతున్నారు. అప్పటికే దీక్షలో ఉంటారు కాబట్టి… పోలీసులు బలవంతంగా ఖాళీ చేయిస్తే తప్ప… అక్కడ్నుంచి కదిలే ప్రసక్తే ఉండదని అంటున్నారు. దీని వల్ల నిరుద్యోగ దీక్షను ప్రభుత్వం భగ్నం చేయించిందనే ప్రచారం చేసుకోవచ్చు… అలాగే… పోరాటంలో షర్మిల వెనక్కి తగ్గరని చెప్పుకోవచ్చన్న వ్యూహంతో ముందస్తుగానే ఇలాంటి ప్రచారం చేస్తున్నట్లుగా భావిస్తున్నారు. కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలనుకుంటున్న పోలీసులు తాము ఇచ్చిన పర్మిషన్ను కాదని.. ఇంకా ఎక్కువ సమయం షర్మిల దీక్ష చేస్తే ఏం చేస్తారన్నదానిపై ఇప్పుడు ఆసక్తి వ్యక్తమవుతోంది.
షర్మిల దీక్షకు వివిధ పార్టీల మద్దతు కూడగట్టేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారు. తెర వెనుక సహకారం అందిస్తున్న పలు పార్టీల నేతలు.. కొంత మందిని షర్మిల దీక్షకు మద్దతు పలికేలా ఒప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఓ అఖిలపక్షం రెడీ అయిందని చెబుతున్నారు. షర్మిల ఉద్యోగ సభకు అఖిలపక్షం వెళ్లి మద్దతు ప్రకటిస్తుందని అంటున్నారు. షర్మిల తన రాజకీయ పయనం సాఫీగా ఉండేలా చూసుకోవడమే కాదు… కావాల్సిన రాజకీయ మద్దతును కూడగట్టుకోవడంలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.