వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు షర్మిల సిద్ధమయ్యారు. నాలుగో తేదీన ఢిల్లీలో షర్మిల లాంఛనంగా పని పూర్తి చేస్తారని అంటున్నారు. దీనిపై ఇప్పటికే కాంగ్రెస్ ఢిల్లీ మీడియాకు లీక్ ఇచ్చింది. షర్మిల మంగళవారం ఇడుపుల పాయకు వెళ్తున్నారు. తన కుమారుడి పెళ్లి పత్రికను తండ్రి సమాధి దగ్గర ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ కార్యక్రమానికి మీడియాను ఆహ్వానించారు. అక్కడ ఆమె తన రాజకీయ భవిష్యత్ , పయనం గురించి ప్రకటించే అవకాశం ఉంది.
వచ్చే ఎన్నికల్లో కడప నుంచే పోటీ చేసి ఆలోచనలో ఉన్నందున … పులివెందులలో ఆమె చేపట్టబోయే కార్యక్రమాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆమె పర్యటనకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తాను పోటీ చేస్తాననే సంకేతాలు ఇస్తే… రాజకీయాలు మారిపోయే అవకాశం ఉంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా షర్మిలతో పాటు ఢిల్లీ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ షర్మిల తరపున సజ్జల తరహాలో ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తారని.. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేల్ని చేర్చుకునేందుకు ప్రయత్నిస్తారని అంటున్నారు.
అయితే విజయమ్మ ఎటు వైపు అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. గతంలో రెండు రాష్ట్రాల్లో ఇద్దరు బిడ్డలు రాజకీయం చేస్తారని ఒకరిపై ఒకరు పోటీ చేయరని క్లారిటీ ఇచ్చారు. కానీ అలాంటి పరిస్థితి లేదని తేలిపోయింది. ఇప్పుడు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి రెడీ అయ్యారు. విజయమ్మ ఎవరి వైపు ఉంటారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఆమె రాజకీయంగా బయటకు రాకపోచవచ్చని..కానీ నివాసం మాత్రం షర్మిల ఇంట్లోనేనని భావిస్తున్నారు.