పార్టీ ఆవిర్భావ సభలో వంద రోజుల్లో పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల …. ముహుర్తం ఖరారు చేసుకున్నారు. అక్టోబర్ 18న చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. చేవెళ్ల వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సెంటిమెంట్. ఆయన పాదయాత్రను అక్కడి నుంచే ప్రారంభించారు. అంతే కాదు… ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ పరంగా కార్యక్రమాలను కూడా చేవెళ్ల నుంచే ప్రారంభించేవారు. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన సబితా ఇంద్రారెడ్డిని కూడా వైఎస్ సెంటి్మెంట్గా భావించేవారు. తర్వాత ఆ నియోజకవర్గ రిజర్వుడు కేటగిరిలోకి వెళ్లింది.
తండ్రికి ఉన్న సెంటిమెంట్‌ను షర్మిల ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 18 నుంచి పాదయాత్ర ప్రారంభించి నిరాటంకంగా తెలంగాణ మొత్తం చుట్టేయాలని నిర్ణయించుకున్నారు. వైఎస్ షర్మిలకు పాదయాత్ర కొత్తేమీ కాదు. 2013లో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు పాదయాత్ర చేశారు. పోటీగా షర్మిల కూడా .. తాను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు… మోకాలికి ఆపరేషన్ జరగడంతో కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని తర్వాత పాదయాత్ర పూర్తి చేశారు. ఇప్పుడు మరోసారి తన సొంత పార్టీ కోసం పాదయాత్ర ప్రారంభించబోతున్నారు.
తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని ప్రకటించిన షర్మిల అందుకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పాదయాత్ర చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఇప్పటికే ప్రతి మంగళవారం.. నిరుద్యోగ దీక్థలను షర్మిల ప్రారంభించారు. ఈ సారి అనూహ్యంగా ఉపఎన్నికలు జరుగుతున్న హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. కానీ అక్కడ వైఎస్ఆర్ టీపీ పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని షర్మిలనే ప్రకటించారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా షర్మిల రాజకీయ పార్టీని సన్నద్ధం చేసుకుంటున్నారు. పాదయాత్ర ద్వారా అధికారాన్ని చేపడితే అది సంచలనమే అవుతుందనడంలో సందేహం లేదు.